హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ‘కొండా’.. క్లారిటీ ఇచ్చిన అనుచరులు!

by Anukaran |   ( Updated:2021-08-17 03:38:16.0  )
congress-flag
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ బ‌రిలో దిగ‌డం దాదాపుగా ఖ‌రారైన‌ట్లు కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం అధికారిక ప్రక‌ట‌నే త‌రువాయి. ఈనెల 18న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే ‘ద‌ళిత దండోరా స‌భ‌’లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రక‌టించ‌నున్నార‌ని కొండా కుటుంబానికి అత్యంత‌ స‌న్నిహితులు ‘దిశ‌’కు వెల్లడించారు. సామాజిక వ‌ర్గాల ఓట్ల లెక్కలు, కొండాదంప‌తుల‌కు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న క్యాడ‌రే సురేఖను అభ్యర్థిగా ఎంపిక చేయ‌డానికి ప్రధాన కార‌ణాలుగా తెలుస్తోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 18వేల మున్నూరు కాపు ఓట్లు, 28 వేల‌ ఓట్లు ప‌ద్మశాలిలవి ఉన్నాయి. ఈ అంశం రాజ‌కీయంగా కొంత‌ క‌లిసొచ్చే అవకావం ఉంది.

Konda Surekha, revanth reddy

టీఆర్ఎస్, బీజేపీల‌కు భిన్నంగా బీసీ మ‌హిళ‌కు టికెట్ ఇచ్చిన‌ట్లవుతుంద‌నే స‌మాలోచ‌న‌ల‌తోనే సురేఖ వైపు రేవంత్‌రెడ్డి మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్యనారాయ‌ణ‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాక‌ర్ గౌడ్‌ల పేర్లు వినిపించాయి. అయితే త్రిముఖ పోటీలో ఉండాలంటే సురేఖ ఎంపికే స‌రైంద‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ క‌మాలాపూర్ మండ‌ల ఇన్‌చార్జిగా సురేఖ‌కు బాధ్యత‌లు ద‌క్కడంతో అప్పటి నుంచే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. పార్టీ నాయ‌కుల అభిప్రాయం, స‌ర్వేల అనంత‌రం కొండా సురేఖ అయితే పార్టీ త‌రుపున గ‌ట్టి పోటీ ఇవ్వగ‌లదని రేవంత్‌రెడ్డి భావించిన‌ట్లుగా తెలుస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కేబినేట్‌లో సురేఖ మంత్రిగా కొన‌సాగిన స‌మ‌యంలో క‌మ‌లాపూర్‌, జ‌మ్మికుంట ప్రాంత ప్రజ‌ల‌తో ఆమెకు స‌త్సంబంధాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed