- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమ కిరణం ‘కొల్లూరి’
బౌద్ధమే సకల విజ్ఞానానికి సమసమాజ స్థాపనకు ఏకైక ప్రత్యామ్నాయమని అన్నపరెడ్డి అక్షరసేద్యం చేస్తే.. ఉద్యమమే నిచ్చెన మెట్ల కులవ్యవస్థను చదును చేస్తుందని బలంగా నమ్మాడు తెలంగాణ ఉద్యమకిరణం కొల్లూరి చిరంజీవి. తెలంగాణ తొలి ఉద్యమం 1969లో పొద్దుపొడిచింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీయస్ చదువుతున్నాడు. అప్పటికే కొల్లూరి విద్యార్థి నాయకునిగా పోరాటాలు చేస్తున్నాడు. స్వపరిపాలన కోసం, ఆత్మగౌరవం కోసం, నీళ్లు, నిధులు, నియమాకాలు అన్న నినాదంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో కసితో పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఫైటర్ గా పేరు సంపాదించుకున్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ తన పోరాటాన్ని కొనసాగించారు. వేల మంది విద్యార్థులకు, ఉద్యమకారులకు తన మేధోసంపత్తిని అందించి పోరాట స్ఫూర్తిని రగిలించారు.
వయసును లెక్కచేయకుండా తెలంగాణ లక్ష్య సాధనలో తన వంతు పాత్ర పోషించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో నడిచిన పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన కొల్లూరి అనతి కాలంలోనే ఆయనకు ప్రధాన అనుచరునిగా మారారు. ప్రజా ఉద్యమ పోరాటాల్లో భాగంగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. కొల్లూరి అంటేనే ఉద్యమాలకు చిరునామా.. అజ్ఞాతంలో నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత బహుజనోద్యమాన్ని నిర్మించాలని బలంగా కాంక్షించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొచ్చి విజవంతంగా దూసుకుపోతున్న మాన్యశ్రీ కాన్షీరాం నాయకత్వంలో నడుస్తున్న బీఎస్పీలో 1990 లో చేరి బహుజనవాద వ్యాప్తిలో ఎంతో శ్రమించారు.
ఉద్యమాలనే ఊపిరిగా మలచుకొన్న కొల్లూరి సమసమాజ స్థాపన జరిగినపుడే భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం అమలులోకి వస్తుందన్నారు. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న భారతదేశం సిద్దిస్తుందని బలంగా నమ్మాడు. చివరి వరకు దానికోసమే పనిచేశారు. ఆయన జీవితం మూడు అంశాల్లో నిగూఢమై ఉంది. తెలంగాణ ఉద్యమం, పీపుల్స్ వార్ ఉద్యమం, దళిత ఉద్యమం. మూడు ఉద్యమాలను నిర్వచిస్తే కొల్లూరిని అక్షరీకరించినట్టే.
కొల్లూరితో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డలు ఆత్మబలిదాలు చేసుకున్నారు. విద్యార్థుల బలిదానాలతో నేను ఎంతో కలత చెందాను. బలిదానాలు వద్దు-పోరాటాలే ముద్దు అనే నినాదంతో విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మబలిదాలు చేసుకోకూడదని పాదయాత్ర నిర్వహించాను. ఆ సమయంలో కోదాడ ప్రాంతంలో నాకు లారీ యాక్సిడెంట్ అయింది. నాకు ప్రాణపాయం తప్పింది. నేను ఆస్పత్రిలో మరణపడక మీద ఉన్నపుడు.. కొల్లూరి నాకు ఫోన్ చేశారు.” నాయనా.. నీలాంటి వాళ్లు ఉద్యమానికి చాలా అవసరం పాదయాత్రను ముగించు. రెస్ట్ తీసుకో, ప్రాణాలు త్యాగాలు చేయడానికి మేమున్నామని నాచేత పాదయాత్ర ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చాలా మందితో నాకు ఫోన్లు చేయించారు. కానీ నాకు ఊపిరి ఉన్నంత వరకు ఉద్యమం కోసమే పోరాడుతానని చెప్పాను. అంటే ఉద్యమకారులంటే కొల్లూరికి ప్రాణం. ఉద్యమకారులు చల్లగుంటేనే తెలంగాణ సాధన సాకారమవుతుందని అభిలాషించేవారు. అందులో భాగంగానే నాచేత పాదయాత్ర ముగింపజేయాలని కోరారు. విశ్రాంతి తీసుకున్నాక తిరిగి ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయం. అయితే తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసే నాకు ఆయన నేపథ్యం కూడా కొంత స్ఫూర్తిని రగిలించిందని మనస్ఫూర్తిగా చెప్పగలను. ఆ తర్వాత తెలంగాణ పునర్నిమాణంలో భాగంగా ఆయన చూపిన మార్గంలో నడిచానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.
నిజంగా ఉద్యమకిరణం కొల్లూరి అస్తమించడం తెలంగాణకు చీకటి రోజే.
-సయ్యద్ ఇస్మాయిల్,
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు