బియానీ కుటుంబం నుంచి మరో రిటైల్ సంస్థ

by Harish |
బియానీ కుటుంబం నుంచి మరో రిటైల్ సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్:
సుమారు దశాబ్దన్నర పాటు దేశీయ రిటైల్ మార్కెట్(Retail market)‎లో ఆదరణ సంపాదించిన ఫ్యూచర్ గ్రూప్ (Future group) అధినేత కిషోర్ బియానీ (Kishore biyani)గత నాలుగేళ్ల కాలంలో వచ్చిన కష్టాల నుంచి నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. దీంతో సుమారు రూ. 24,713 కోట్లకు కంపెనీని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబాని (Mukesh ambani)కి విక్రయించారు. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా కిషోర్ బియానీతో పాటు అతని కుటుంబ సభ్యులు మరో 15 ఏళ్ల వరకు రిటైల్ రంగంలోకి రాకూడదనే కార్పొరేట్ ఒప్పందం జరిగినట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎంతవరకు వాస్తవముందో స్పష్టత లేకపోయినప్పటికీ, కిషోర్ బియానీ ఇక రిటైల్ రంగం నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, కిషోర్ బియానీ సోదరుడు రాకేష్ (Rakesh biyani)రిటైల్ రంగంలోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన ఇదివరకు ఫ్యూచర్ గ్రూప్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అథ్నెసిటీ అనే పేరుతో దుస్తుల స్టోర్లను నిర్వహిస్తున్నారు. ఈ స్టోర్లను మరింత విస్తరించి రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయనతో పాటు రాకేష్ కుమార్తెలు అవని, అశ్నిలు కూడా ఇందులో భాగస్వామిగా ఉండనున్నారు.

కాగా, రిలయన్స్ ఒప్పందం గురించి ప్రస్తావించగా, ఆ ఒప్పందం కిషోర్ బియానీ సహా ఆయన కుటుంబసభ్యులకే వర్తిస్తుందని, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాబట్టి, ప్రస్తుతం జరిగిన ఒప్పందంలో భాగంగా కిషోర్ బియానీ కొన్నాళ్లపాటు రిటైల్ రంగంలోకి రాకపోయినా.. ఆయనకున్న అనుభవం రాకేశ్ బియానీకి ఉపయోగపడుతుందని, తద్వారా పరోక్షంగానైన కిషోర్ బియానీ రిటైల్ రంగంతో కలిసే ఉంటారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, రిటైల్ కాకుండా ఇతర రంగాల్లో రాణించేందుకు కిషోర్ బియానీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, మారిన పరిస్థితుల నేపథ్యంలో సరైన వ్యూహంతో రానున్నట్టు, తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కిషోర్ బియానీ తెలిపారు.

Advertisement

Next Story