కిరాణా షాపులన్నీ ఇక కార్పొరేట్ల గుప్పిట్లోకి వచ్చేస్తాయా?

by Shamantha N |
కిరాణా షాపులన్నీ ఇక కార్పొరేట్ల గుప్పిట్లోకి వచ్చేస్తాయా?
X

దిశ, న్యూస్ బ్యూరో :

‘‘రాత్రి 10 గంటలకు ఆఫీసు నుంచి వచ్చిన భర్త కోసం ఓ గృహిణి వంట మొదలు పెట్టింది. కూర వండుదామని చూసేసరికి ఇంట్లో ఉల్లిపాయలైపోయాయి. అంతే.. వెంటనే టీవీ చూస్తున్న కొడుకును పంపి దగ్గరలో ఉన్న కిరాణాషాపు నుంచి అరకిలో ఉల్లిగడ్డలు తెప్పించుకుంది.’’

‘‘నైట్ డ్యూటీ చేసి వచ్చిన ఇద్దరు బ్యాచ్‌లర్స్ బాగా లేట్‌గా లేచారు. ఆకలి దంచేస్తుంది.. వండుకుందామని చూస్తే కూరగాయలు లేవు. ఏం చేయాలో ఆలోచిస్తూ నైట్ డ్రెస్ పైనే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి గుడ్లు, టమాటలు తెచ్చి వండుకు తిన్నారు.’’

‘‘పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే కూతురుకు బూస్ట్ కలిపి ఇద్దామని ఓ తల్లి పాలవాని కోసం చూసింది. అతను ఎంతకూ రాకపోవడంతో వెళ్లి కిరాణంలో పాల ప్యాకెట్ తెచ్చి పనికానిచ్చింది.’’

ఇలా బడుగుల, దిగువ, మధ్యతరగతి వర్గాల బతుకుల్లో కిరాణా షాపు ఒక భాగమైపోయింది. ఎప్పుడంటే అప్పుడు, ఏది అంటే అది నిమిషాల్లో తెచ్చుకుని వాడే సౌకర్యం కిరాణా మనకు కల్పించింది. మారుమూల పల్లె అయినా, అభివృద్ధి చెందిన నగరమైనా ప్రతి గల్లీలోనూ సేవలందించేది కిరాణా దుకాణమే. ఇప్పుడా దుకాణాల రూపు మారిపోనుంది. వాటి అస్తిత్వానికే ముప్పు ముంచుకురానుంది. రిలయెన్స్ జియోమార్ట్, అమెజాన్ లోకల్ షాప్స్ పోటాపోటీగా రంగంలోకి దిగాయి. స్థానిక కిరాణాషాపులను తమ ఏజెంట్లుగా మార్చుకుని ఇంటింటికీ తమ సరుకులను అందించనున్నాయి. గల్లీ కిరాణా వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోబోతున్నాయి. జియోమార్ట్ ఇప్పటికే ముంబై లాంటి నగరాల్లో సేవలను ప్రారంభించగా, అమెజాన్ దేశంలోని వంద నగరాల్లో ఐదు వేల కిరాణా దుకాణాలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధపడింది.

2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రిటైల్ రంగంలో 51 శాతం వాటా తీసుకునే విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చినా ఆ పాలసీ వల్ల విదేశీ పెట్టుబడులైతే వచ్చాయి గానీ కిరాణా వ్యవస్థ చెక్కుచెదరలేదు. అమెరికా, యూరప్‌ల నుంచి వేల కోట్ల పెట్టుబడులు మోసుకొచ్చిన వాల్ మార్ట్, టెస్కో, కేర్ ఫర్ లాంటి రిటైల్ కార్పొరేట్ల ధాటికి చిన్నగా, 250 నుంచి 750 స్క్వేర్ ఫీట్ల జాగాలో ఉండే భారత్‌లోని 1 కోటి 20 లక్షల కిరాణా షాపులు తట్టుకున్నాయి. దేశీయంగానూ వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన డీమార్ట్, మోర్, బిగ్ బజార్, రిలయన్స్, స్పెన్సర్స్, హెరిటేజ్ లాంటి సూపర్ మార్కెట్లనూ ఇవి దీటుగా ఎదుర్కొన్నాయి. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సరుకులంటున్న బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి ఆన్‌లైన్ సూపర్ మార్కెట్‌లకు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి విదేశీ ఈ-టెయిలింగ్ (ఈ కామర్స్) దిగ్గజాల సాంకేతికత స్పీడును సైతం తట్టుకోగలిగాయి. దీనికి కారణం ప్రతి ఏరియాలో మూల మూలనా ఉండే కిరాణా షాపులకు అక్కడ ఉండే ప్రజలతో ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న అనుబంధమేనని చెప్పొచ్చు.

రంగంలోకి జియోమార్ట్..

చాలాకాలం పాటు ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న కిరాణా షాపులకు ఊతమిచ్చేందుకు ‘జియో మార్ట్’ సేవలను ప్రారంభిస్తున్నట్లు దేశ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చెబుతున్నారు. ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడిచే వాట్సాప్‌తో కలిసి దేశంలోని కిరాణాలను బలోపేతం చేయనున్నట్టు ఇటీవల వాట్సాప్ జియో ఫ్లాట్‌ఫామ్ లో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించిన సందర్భంగా ఆయన వెల్లడించారు. వాట్సాప్‌కున్న 40 కోట్ల యూజర్స్, జియోకున్న మరో 30 కోట్ల సబ్‌స్ర్కైబర్స్
బేస్‌తో జియోమార్ట్‌ను తాజాగా ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సేవలు త్వరలోనే దేశం నలుమూలలా, గల్లీ గల్లీలోకి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలకు పోటీగా రిలయన్స్ ఈ జియోమార్ట్‌ను తేవడం వెనుక వాణిజ్య కోణం
ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన జియోమార్ట్ సేవల ప్రకారం వాట్సాప్ నుంచి జియో మార్ట్ ఇచ్చిన నెంబర్‌కు మెసేజ్ చేస్తే మనకు కావాల్సిన సరుకులు ఆర్డర్ చేయడానికోసం ఒక ఫార్మాట్ వస్తుంది. అందులో మన అవసరాలను నింపి పంపిన తర్వాత కాసేపట్లో దగ్గర్లోని కిరాణాషాపు మనిషి వచ్చి సరుకులు డెలివరీ చేస్తాడు. బిల్లింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కిరాణా యజమానికి ఆ సరుకుల ధరల్లో నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తారు. దుకాణానికి అవసరమైన స్టాకు రిలయెన్స్ గోడౌన్ల నుంచే అందుతుంది. గ్రోసరీ రిటైలింగ్‌లోనే ఉన్న జియోమార్ట్ పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కే చెందిన రిలయన్స్ రిటైల్‌ సూపర్ మార్కెట్‌కు ఇది కచ్చితంగా ప్లస్ అవనున్నట్టు సమాచారం. వాట్సాప్, జియో మొబైల్ నెట్‌వర్క్‌లకు దేశవ్యాప్తంగా వేళ్లూనుకుపోయిన రీచ్ వల్ల ప్రతి కిరాణా షాపు యజమాని జియోమార్ట్‌లో చేరతారని, వీరందరికీ హోల్‌సేల్‌గా నిత్యావసరాలమ్మేందుకు ప్రస్తుతమున్న రిలయన్స్ సూపర్ మార్కెట్లను హోల్ సేల్ షాపులుగా మార్చనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కిరాణా షాపులను పీఓఎస్ మెషిన్లతో ఇప్పటికే అనుసంధానం చేయడం ప్రారంభించినట్లు కూడా వారు చెబుతున్నారు. లోకల్ కిరాణా షాపులు ఇతర కార్పొరేట్ రిటైలర్ల పరిధిలోకి వెళ్లకుండా చేయడంతో పాటు తను లాభపడి ‘విన్ విన్’ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడమే జియోమార్ట్ తేవడం ముఖేష్ అంబానీ ఆలోచన అని పలువురు రిటైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పోటీలో లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్..

ఇప్పటిదాకా ఈ-కామర్స్ రంగంలో ఉన్న అమెజాన్ ఇప్పుడు జియోమార్ట్ కు పోటీగా తానూ రంగంలోకి దిగింది. షాప్ ఆన్ అమెజాన్ పేరుతో వందకు పైగా నగరాల్లో 5 వేల స్థానిక కిరాణాషాపులను లింకు చేసుకుని సరుకులు అందించే వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఇలాంటి సేవలను ఆ సంస్థ ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా చేపట్టలేదు. ఇండియాలోనే మొట్టమొదట ప్రారంభించిందంటే ఇక్కడి రిటైల్ గ్రోసరీ మార్కెట్‌పై ఎంత పోటీ నెలకొనివుందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా టైంలో ఆదుకున్న కిరాణా..

కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశంలో, రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సప్లయ్ చైన్ కొంత వరకు దెబ్బతిన్నది. దీంతో దేశంలోని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ చైన్లు కూడా కరోనా కాలంలో అన్ని రకాల సరుకులు అందించలేక చేతులెత్తేశాయి. ఎప్పుడు ఏ రూల్ పెట్టి ఇంట్లో నుంచి బయటికి రానిస్తారో లేదో తెలియక లాక్‌డౌన్ మొదట్లో బెంబేలెత్తిపోయిన ప్రజలు ఒక్కసారిగా ప్యానిక్ బయ్యింగ్ చేయడంతో, పేరొందిన సూపర్ మార్కెట్లలోని ర్యాకులన్నీ ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇంటి దగ్గర ఉండే కిరాణా షాపులే ఎప్పటికప్పుడు తమ హోల్ సేల్ డీలర్ల నుంచి,
డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరుకులు తెప్పించుకొని అందించగలిగాయి. ఒక వేళ కూలీలు అందుబాటులో లేక ట్రాన్స్‌పోర్టు వాహనాలు రాకపొతే స్కూటర్లు వేసుకొని వెళ్లి మరీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర సామాను తీసుకొచ్చి ప్రజలకు సేవలందించి తమ అవసరాన్ని మరోసారి మాడ్రన్ మార్కెట్ మోజులో పడ్డ సొసైటీకి కిరాణాల యజమానులు గుర్తు చేశారు. దీంతో లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కిరాణా షాపుల్లో విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే 30 శాతం దాకా పెరిగాయని ఒక అధ్యయనం చెబుతోంది.

గత దశాబ్దంలో మారిన ట్రెండ్..

పట్టణీకరణ, పెరిగిన ఆదాయం, దాంతో పాటు పెరిగిన డిస్క్రిషనరీ స్పెండింగ్ వల్ల హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ప్రజలు కొనుగోలు చేసే నెలవారీ నిత్యావసర సరుకుల పరిమాణం, విలువ రెండూ పెరిగాయి ఇదే కాక ప్రజల ఆహార అలవాట్లు మారాయి. కావాల్సిన సరుకులు కొన్ని వీధిలోని కిరాణా షాపుల్లో దొరక్కపోవడంతో పాటు స్మార్ట్ ఫోన్లు, వాటిలో వాడే డాటా చార్జీలు తగ్గడంతో ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్, అవి అందించే క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెరిగిపోయాయి. వీటికి తోడు క్రెడిట్ కార్డులు ఉండనే ఉన్నాయి. దీంతో కావాల్సిన ప్రతీది దొరకడం లేదని, కిరాణాలో క్యాష్ పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ పాయింట్లు, ఆఫర్లు ఉండవని మెట్రో నగరాల్లో అధిక ఆదాయం ఉన్న మెజారిటీ ప్రజలు తమకు కావాల్సిన నెలవారీ నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్‌లకే వెళ్తున్నారు. ఎప్పుడో అర్జెంట్ అయితే తప్ప, ఇంటి దగ్గర కిరణా షాపులో కిరాణా సరుకులు కొనడం లేదని తెలుస్తోంది. అయితే దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమకు కావాల్సిన నెలవారి నిత్యావసరాల కోసం ఇప్పటికీ తమ ప్రాంతాల్లో ఉండే కిరాణా షాపుల మీదే ఆధారపడుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. దేశంలో బాగా పాపులర్ అయిందనుకుంటున్న మోడ్రన్ రిటైలింగ్ ఇప్పటికీ మొత్తం రిటైలింగ్ వ్యాపారంలో కేవలం 8 శాతం మాత్రమే వాటా కలిగి ఉందంటే.. సాంప్రదాయ రిటైల్ షాపుల వ్యవస్థ ఎంత బలమైందో అర్థమవుతోంది.

అప్‌గ్రేడ్ అయితే లైఫ్ ఉంది : నవీన్‌ అగర్వాల్, కిరాణా షా‌పు యజమాని, ఆర్.కె పురం, హైదరాబాద్

‘నేను 800 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో 20 ఏళ్ల నుంచి కిరాణా షాపు నడుపుతున్నాను. రోజుకు రూ.30 వేల దాకా ఆదాయం వస్తుంది. నెలకు 8 నుంచి 9 లక్షల దాకా వస్తాయి. అయితే ఇందులో చివరికి అన్ని ఖర్చులు పోను 10 శాతం దాకా మిగిలితే గొప్ప. అంటే రూ.80 వేల నుంచి రూ.90 వేల దాకా మిగులుతుంది. జనాల వినియోగం ట్రెండ్ మారింది. కొత్త కొత్త సామాన్లు అడుగుతున్నారు. జనం అడిగినపుడు ఒక్కటి లేదన్నా ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద పడుతుంది. ఇంకోసారి ఉన్నదానికోసం కూడా
రాకపోవచ్చు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లతో పోటీ పడాలంటే ఎంతో కొంత మేం కూడా అప్ గ్రేడ్ అవాలి కదా. పాత పద్ధతిలో నడిపితే లైఫ్ లేదు. అలా ఇప్పటికీ చాలా మూసేశారు. ఇప్పుడు కొత్తగా మా షాపులను కస్టమర్‌లతో కలిపే జియో మార్ట్ వచ్చేస్తోందంటున్నారు. మాకైతే అది మంచిదే అనిపిస్తోంది. కస్టమర్ల ట్రెండ్‌కు తగ్గట్టు కొన్ని సామాన్లు జియోమార్ట్ మాకు అమ్మి వ్యాపారం చేసుకున్నప్పటికీ మేం కూడా టెక్నాలజీతో కస్టమర్‌కు దగ్గరవొచ్చు. జనం సూపర్ మార్కెట్‌కు వెళ్లడం కొంత వరకైనా తగ్గి మాకు బిజినెస్ వస్తే బెటరే. వెయిట్ చేసి చూద్దాం.

మా అస్తిత్వం పోయినట్లే : మల్లేశం, దుకాణాదారుడు, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్

ఇంతకాలం మాకు స్థానికంగా ఓ గుర్తింపు ఉండేది. ఏ సామాన్లు తేవాలో, ఏవి తేకూడదో మాకు స్వేచ్ఛ ఉండేది. ఎంతకు అమ్మాలనే విషయంలో కూడా వెసులుబాటు ఉండేది. జియోమార్ట్ వస్తే మేం కేవలం కమీషన్ ఏజెంట్లమవుతాం. వాళ్లేం చెబితే అది చేయాలి. మొదట వినియోగదారులకు లాభం జరిగినా మొత్తం కిరాణాలు వాళ్ల గుప్పిట్లోకి వెళ్లిన తర్వాత నష్టమేనన్నది నా అభిప్రాయం. ఓలా, ఉబర్ సేవల విషయంలో ఇదే జరిగింది కదా.. ఇప్పుడు కూడా అదే జరగచ్చు. ఎవరికి తెలుసు. రేపు రేపు జియోమార్ట్ కిరాణాలు, అమెజాన్ కిరాణాలు అని మాత్రమే ఉంటాయేమో..

Tags: Kirana, jiomart, amazon, heritage, big bazaar, retailing, e tailing

Advertisement

Next Story

Most Viewed