ఒకవైపు కరోనా భయం… మరోవైపు ధరాఘాతం

by srinivas |
ఒకవైపు కరోనా భయం… మరోవైపు ధరాఘాతం
X

ఆంధ్రప్రదేశ్ వాసులను ఒకవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి భయపెడుతుంటే.. మరోవైపు ధరాఘాతం షాక్‌నిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని జనత కర్ఫ్యూని అమలులోకి తెచ్చారు. రాత్రి 9 గంటల వరకు అని చెబితే.. చప్పట్లు కొట్టే నెపంతో సాయంత్రం ఐదు గంటలకే జనతా కర్ఫ్యూని ముగించారు. దీంతో ఇష్టానికి వదిలితే పట్టించుకోరని, తరువాతి రోజు నుంచి లాక్‌డౌన్ విధించారు.

లాక్‌డౌన్‌తో ఏం చేయాలో పాలుపోలేదు. ఆదాయం, నిత్యావసరాలు ఇలా ప్రతిదానికి భయపడిన ప్రజలు నిత్యావసరాలను టోకున కొనుగోలు చేసి, నిల్వ ఉంచుకున్నారు. దీంతో స్థానికి దుకాణాల్లో సరకు నిండుకుంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం ఒంటిగంట వరకు షాపులు ఓపెన్ ఉంటాయని ప్రకటించింది. పలు హెచ్చరికల నేపథ్యంలో దీనిని కూడా కుదించి ఉదయం 11 గంటల వరకు షాపులు తెరవవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలలా ఉంటే ఉదయం 9 గంటలకు షాపు ముయ్యకపోయినా.. 9 గంటల తరువాత రోడ్ల మీద కనబడినా పోలీసులు లాఠీలు బయటకు తీస్తున్నారు. ఒళ్లు హూనం చేసుకోవడం ఇష్టం లేని ప్రజలు కుక్కినపేనుల్లా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

దీనిని వ్యాపారస్తులు ఆసరాగా తీసుకున్నారు. సరకులు అరకొరగా వస్తున్నాయని, స్టాకు లేదని చెబుతూ అధిక ధరలకు అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌కు ముందున్న ధరలను ప్రస్తుత ధరలతో పోల్చితే తేడా ఏంటో అర్ధమవుతుంది. ఈ మార్కెట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వమే ధరలను నిర్ణయించింది. అయినప్పటికీ వాటిని పట్టించుకునే నాధుడు లేడు. ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు ఉండవన్న దీమా వర్తక వర్గాల్లో నెలకొంది. ఒక వేళ ధరలు పెంచినట్టు తేలినా ఎవరో ఒక రాజకీయ నాయకుడు పలుకుబడి ఉపయోగించి దర్జాగా తిరిగేయొచ్చన్న ధీమా వారిని ధరలు పెంచేందుకు పురిగొల్పుతోంది.

ఈ ధైర్యంతోనే నిత్యావసర సరకులను 10 నుంచి 30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అవసరంలో ఉన్న వినియోగదారుడు తప్పని సరి పరిస్ధితుల్లో వాటిని కొనుగోలు చేస్తున్నాడు. నిత్యవసర సరకులతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడం విశేషం. రైతుబజార్‌లో ప్రభుత్వ నియంత్రణ ఉండడంతో అక్కడ సాధారణ ధరలే ఉన్నప్పటికీ… బయట దుకాణాల్లో మాత్రం కిలో కూరగాయలకు 10 నుంచి 20 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ ధరలు పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయి. బియ్యం, మినపు పప్పు, శనగపప్పు, పెసర పప్పు, వంట నూనె, చింతపండు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, శనగ పిండి, మైదా పిండి, గోధుమ పిండి ధరలు పెరిగాయి. బియ్యం (25 కిలోల బస్తా) రకాలనుబట్టి గతంలో వున్న ధరలకన్నా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతయ్యే గోధుమ రవ్వ, గోధుమ పిండి ధర పెరిగింది. దిగుమతి తగ్గడంతో దొరకడం కూడా లేదు.

ప్రభుత్వం సూచించిన ధరలు రైతుబజార్లకు మాత్రమే పరిమితమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకులు, కాయగూరల ధరలను వ్యాపారులే నిర్ణయించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన ధరల్లో వారు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 11 గంటల వరకే షాపులు తెరచి ఉంచడంతో అంతమందిలోకి రావడం క్షేమం కాదని భావిస్తున్న చాలామంది రహదారులపై వున్న దుకాణాలు, కాయగూరల షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇది లాక్‌డౌన్‌తో పనులు లేక అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలు భారంగా మారాయి.

Tags : vegetables, home needs, household items, shops, markets, ap, lockdown

Advertisement

Next Story

Most Viewed