‘యువత అప్రమత్తంగా ఉండాలి.. బెట్టింగ్‌లకు బలికావొద్దు’:జిల్లా ఎస్పీ

by Jakkula Mamatha |
‘యువత అప్రమత్తంగా ఉండాలి.. బెట్టింగ్‌లకు బలికావొద్దు’:జిల్లా ఎస్పీ
X

దిశ ప్రతినిధి, బాపట్ల: యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. బెట్టింగ్ వలన కలిగే అనర్థాల గురించి జిల్లా ప్రజలకు, యువతకు అవగాహన కలిగించేందుకు జిల్లా ఎస్పీ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలవుతున్నాయి అని అన్నారు. వీటిని అదునుగా చేసుకొని కొందరు స్వార్ధపరులు, చెడు నడతలు కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ లకు తెర లేపే అవకాశం ఉందన్నారు.

బెట్టింగ్ లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారన్నారు. సులభంగా అధిక నగదును అర్జించవచ్చునని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతారన్నారు. ఒక్కసారి బెట్టింగ్‌లకు అలవాటు పడితే వాటి నుంచి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్ట పోవడం జరుగుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారన్నారు.

బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అధ:పాతాళానికి నెట్టేస్తుంది. యువత దానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రికెట్ మ్యాచ్ లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగులు వైపు మొగ్గు చూపకూడదన్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిష్యత్తు పై దృష్టి సారించాలన్నారు. తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండండి.

Next Story

Most Viewed