జైలులో గిరిజన మహిళలపై చిత్రహింసలు.. కాళ్లు మొక్కినా వదల్లేదు..!

by Anukaran |   ( Updated:2021-08-11 05:47:46.0  )
జైలులో గిరిజన మహిళలపై చిత్రహింసలు.. కాళ్లు మొక్కినా వదల్లేదు..!
X

దిశ, ఖమ్మం రూరల్​: కొణిజర్ల మండలంలోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారుల తనిఖీలను అడ్డుకున్నారని 23 మంది మహిళలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. వారిలో చిన్నపిల్లల తల్లులను జైలుకు పంపించడంపై దుమారం చెల్లరేగింది. వారం రోజులు చిన్నారులతో జైలు జీవితం గడిపిన మహిళలు బుధవారం విడుదలయ్యారు. మహిళల విడుదల సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) నాయకులు స్వాగతం పలికారు. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జైలులో అక్రమంగా బనాయించారని జిల్లా జైలు ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. జైలులో మమ్మల్ని చాలా దారుణంగా చూశారని, 20 బస్తాల బియ్యంలో రాళ్లను ఏరించారని, టీ, టిఫిన్​ కూడా పెట్టలేదని, రూమ్‌లోనే బంధించారని ఆరోపించారు. చర్లపల్లి జైలుకు పంపిస్తామని అధికారులు బెదిరించారని.. కాళ్లు పట్టుకున్నా భోజనం పెట్టలేదని వాపోయారు. మూడు రోజుల నుంచి బాత్​రూమ్​, టాయిలెట్‌ రూమ్‌లను శుభ్రం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోడు భూముల కోసం పోరాటం చేస్తే.. దాడులు చేయడమే కాకుండా మహిళల పట్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం చాలా దారుణమైన విషయమని సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. తెలంగాణ పౌర సమాజం అంతా మహిళల అరెస్టును ఖండించాలని పిలుపునిచ్చారు. ఫారెస్ట్​ అధికారులు దాడులు చేసి.. హత్యాయత్నం కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. పోడు భూములకు హక్కు కల్పించాలని, మహిళలను వేధించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని పోటు రంగారావు హెచ్చరించారు. ఈ ఆందోళనతో జైలు సూపరింటెండెంట్​ శ్రీధర్ ​మహిళలను ఇబ్బంది పెట్టిన అధికారులపై విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story

Most Viewed