ఆదేశిస్తే.. ఒక్క నిమిషంలో రాజీనామా: కేశినేని నాని

by Ramesh Goud |
ఆదేశిస్తే.. ఒక్క నిమిషంలో రాజీనామా: కేశినేని నాని
X

దిశ వెబ్‌డెస్క్: బెజవాడ టీడీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. టీడీపీలోని రెండు వర్గాలు మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలు చేసుకుంటుండటంతో.. బెజవాడ రాజకీయం హీటెక్కింది. మొన్నటివరకు బయటపడని ఈ విబేధాలు.. ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో ఏం జరుగుతుందోనని ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్గంపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడి విమర్శలు చేసుకుంటున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని నాని కూతురు శ్వేతను ప్రకటించడం బుద్ధా వెంకన్న, బోండా ఉమ వర్గానికి నచ్చడం లేదు.

దీంతో ‘నువ్వేమన్నా తోపువా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి చూపించు.. మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం’ అని బోండా ఉమ విమర్శలు చేశారు. ‘రంగా హత్య కేసులో నిందితులతో ఫోన్లు చేయిస్తావా.. కేశినేని నానిని చంద్రబాబు కంట్రోల్‌లో పెట్టాలి’ అని బోండా ఉమ సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిని తానేనంటూ బుద్ధా వెంకన్న ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం అగ్గిని మరింత రాజేసింది.

ఈ క్రమంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. తన తీరు నచ్చనివారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయవచ్చని, తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయనన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే.. ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానని కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed