కేంద్రంపై పోరు.. కేసీఆర్, కేటీఆర్ దూరమెందుకు?

by Anukaran |   ( Updated:2021-12-19 21:38:46.0  )
కేంద్రంపై పోరు.. కేసీఆర్, కేటీఆర్ దూరమెందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ సోమవారం గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సన్నద్ధమైంది. చావుడప్పు, ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాల్గొంటారు. గ్రామాల్లో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు బలంగా వివరించనున్నారు.

తెలంగాణ రైతాంగంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఈనెల 20న గ్రామగ్రామాన చావుడప్పు, ర్యాలీలు, శవయాత్ర ఊరేగింపు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ నెల 17న తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో పిలుపునిచ్చిన విషయం విధితమే. ఆ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పాల్గొనున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించనున్నారు. ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు వేదికల ద్వారా కల్పించే అవగాహన తదితర అంశాలన్నింటిని మరోసారి ప్రజలకు గుర్తుచేయనున్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో కొత్తగా లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయ‌ని, రాష్ట్రంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందనే విషయాన్ని వివరించనున్నారు.

వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం అస్పష్టమైన ప్రకటనలు, గందరగోళం చేస్తూ అయోమయపరుస్తుండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరిసాగు చేయవద్దని చెబుతుందని వివరించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయపంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూనే బీజేపీ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ.. మరోపక్క ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానాస్త్రంగా కేంద్రానికి మంత్రులు, ఎంపీల బృందం కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మరోమారు వెళ్లిన అంశాన్ని వివరించనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ బృందం గతంలో వెళ్లి విజ్ఞప్తి చేసిన అంశంతో పాటు కేంద్రం ఇచ్చిన హామీని, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు. ఆదివారం మంత్రులు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.

నేటి ధర్నాకు కేసీఆర్ కుటుంబం దూరం!

కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు గ్రామగ్రామాన సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అయితే సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్ పాల్గొనడం లేదు. నిజామాబాద్ నుంచి ఎంపీగా, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత సైతం ఏ నియోజకవర్గంలో పాల్గొంటారో స్పష్టత రాలేదు. అసలు పాల్గొంటారా? లేదో తెలియదు. శ్రేణులంతా పాల్గొనాలని సూచించినప్పటికీ వారు మాత్రం పాల్గొనకపోవడంలో అర్ధమేంటో వారికే తెలియాలి.

గ్రేటర్ లో నిరసన, ధర్నా లేదు

గ్రేటర్ హైదరాబాద్ లో సోమవారం ధర్నా, నిరసన కార్యక్రమాలు లేవు. సాగు, వ్యవసాయం లేదన్న సాకుతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదు. రాజధానిలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చి స్థిరపడినవారు… ఉపాధి కోసం వచ్చినవారే ఎక్కువ. అయినప్పటికీ అవేమీ ఆలోచించకుండా కార్యక్రమాన్ని బంద్ చేశారు. ఈ నెల 21న ఎల్ బీనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నందున ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.

ధర్నాకు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు

టీఆర్ఎస్ సోమవారం చేపట్టిన ధర్నాకు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అసోసియేషన్ నాయకులు మద్దతు లేఖను అందజేశారు. రైతుల పక్షాన చేపట్టే కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రైతులు ధాన్యం పండిస్తేనే లారీ యజమానులు సిబ్బందికి ఉపాధి లభిస్తుందన్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని, ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చాంద్ బాషా, ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు, సలాలుద్దీన్, సుధాకర్ గౌడ్, వేముల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మరిన్ని పదవుల భర్తీకి రంగం సిద్ధం

Advertisement

Next Story