- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీఆర్సీ: కేసీఆర్ వ్యూహం ఇదేనా!!
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం కావడంపై ఉద్యోగుల్లో జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఉద్యోగులతో కేసీఆర్ సమావేశమయ్యారని అంటున్నారు. ఉద్యోగుల ఓట్ల కోసం మంత్రులు చేసిన రాయబారాలు ఫలించకపోవడంతోనే.. కేసీఆర్ రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.
సీఎం అత్యవసరంగా ఉద్యోగ నేతలను పిలిపించుకుని పీఆర్సీ అంశాన్ని చర్చించారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ పీఆర్సీపై సీఎం పల్లెత్తు ప్రకటన చేయకుండా దానిని ఉద్యోగ నేతలతోనే చెప్పించారు. అది కూడా ఈ నెల 19 తర్వాతే వస్తుందనిపించారు. అంటే మండలి ఎన్నికల్లో అభ్యర్థులు గెలిస్తేనే ఎంతోకొంత పీఆర్సీ వస్తుందన్నమాట. ఒకవేళ ఉద్యోగుల కోపం చల్లారకుండా, పట్టభద్రుల ఆవేశం, నిరుద్యోగుల కోపం కొనసాగి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోతే… మళ్లీ నాలుగు నెలలు ఈ విషయం గురించే మాట్లాడరని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ మండలి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వేసిన ఈ వ్యూహానికి ఉద్యోగ వర్గాలు చిక్కుతాయా?… ఓట్లు అనుకూలంగా వేస్తాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంగళవారం నాటి సీఎం మీటింగ్ అనుకూల ఓట్లకు అనువుగా మారిందా? లేదా? అనేది ఈ నెల 14 తర్వాత తేలనుంది.
సాగదీత… సాగదీత… సాగదీత
ఉమ్మడి రాష్ట్రంలో ఒకే అధికారితో ఉండే వేతన సవరణ కమిషన్ స్వరాష్ట్రంలో ముగ్గురు అధికారులకు పెరిగింది. 2018 జూన్‌లో ఏర్పాటైన 11వ వేతన సవరణ కమిషన్ టార్గెట్ కేవలం మూడు నెలలు. ఎందుకంటే అన్ని అంశాలు త్వరగా తేల్చాలనే కారణంగా సీఎం కేసీఆర్ త్రిసభ్య కమిటీని నియమించారు. కానీ జరిగింది మళ్లీ పాత కథే. దాదాపు మూడేళ్ల సమయం తీసుకుని చివరకు గత ఏడాది డిసెంబర్‌లో నివేదిక అందించారు. ఈ నివేదికలో వేతన సవరణను 7.5 శాతానికి తగ్గించారు. ధరలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏను తగ్గించారు. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం తెచ్చింది. అయినా సీఎం మౌనం దాల్చారు. ఒక్క ప్రకటన చేయలేదు. ఉద్యోగ సంఘాలు నెత్తీనోరు బాదుకున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి అనుకూల ప్రకటనే లేదు. ఇదే సమయంలో మండలి ఎన్నికలు వచ్చాయి.
సమయం కూడా ఇవ్వలేదు మిత్రమా..!
పీఆర్సీపై మాట్లాడేందుకు ఉద్యోగ జేఏసీగా ఉన్న ప్రధాన సంఘాలు సీఎంకు, మంత్రులకు మొర పెట్టుకున్నాయి. కిందిస్థాయి నుంచి ఒత్తిడి వస్తుందని బతిమిలాడాయి. సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగాయి. కానీ అటు నుంచి రిప్లై లేదు.
ఇప్పుడే సమయం
ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం వచ్చింది. అసలే కోపంగా ఉన్న ఉద్యోగులను చల్లార్చేందుకు మంత్రులు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగ నేతలు మద్దతు ఇస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యం. ఈ విషయాన్ని సీఎంకు మంత్రులు చెప్పడంతో.. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ప్రకటన చేయించారు.
ముందున్న ప్రశ్నలు అనేకం
ఇప్పుడు ఉద్యోగుల ముందు చాలా ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఎందుకంటే మూడేళ్ల పాటు సాగదీసిన అంశాన్ని ఇప్పుడు ఓట్ల ప్రేమతో తేలుస్తారా అన్నది తేలని ప్రశ్నే. అందులోనూ సీఎం కేసీఆర్ డిసెంబర్‌లో మాట్లాడినప్పుడు జనవరి నెలాఖరుకల్లా అన్నీ పూర్తి చేయాలన్నారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ముడిపడలేదు. బదిలీలు చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. సాక్షాత్తూ సీఎస్ చేతిలో ఉన్న నాలుగు ప్రధాన శాఖల్లోనే పోస్టింగులు లేవు. ప్రమోషన్లకు బ్రేక్ పడింది. అటు ఫిట్మెంట్ తేల్చలేదు. ఇప్పుడు మండలి ఎన్నికలు కావడం, అందులోనూ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారడంతో.. వాటిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈనెలలో పీఆర్సీ వస్తుందంటూ చెప్పించారు. కానీ ఎంత మేరకు దీన్ని నమ్మాలో ఉద్యోగులకు అర్థం కావడం లేదు.
వస్తుందా… లేదా..?
“ అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని గుమ్మానికి కట్టి దాన్ని చూస్తూ తెల్లన్నం పల్లెంలో పెట్టుకుని తింటున్నట్టుగా… ఇప్పుడు కూడా పీఆర్సీని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఓట్లు రాబట్టుకునే యత్నంగానే ఉద్యోగులు భావిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఓట్లు లాభిస్తే మార్చిలో పీఆర్సీ వస్తుందా? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే అటు సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది తెలియదు. సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్లీ నెలన్నర రోజులు ఆగిపోవాల్సిందే. దాని తర్వాత మినీ పురపోరు దాదాపు సిద్ధమవుతోంది. డివిజన్ల పునర్విభజన పూర్తి అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎలాగూ ప్రభుత్వం చెప్పినట్టే వింటుంది కాబట్టి… ఎప్పుడంటే అప్పుడు షెడ్యూల్ జారీ చేసేందుకు రెడీగానే ఉంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ కూడా వస్తే.. ఇక పీఆర్సీ నాలుగు నెలల దాకా రాదన్నట్టే. ఈలోగా పీఆర్సీని ఆశగా చూపిస్తూ ప్రభుత్వం ఓట్ల కథను గట్టెక్కించుకుంటోంది. ఆ తర్వాత ఉద్యోగుల ఓట్ల అవసరం ఉండదు. ఎటూ వచ్చి మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకే. అంటే పీఆర్సీ అంశం ప్రకటించినట్టుగా ఇప్పుడు తేలుస్తారా? అనేది ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారు కూడా దొరకడం లేదు.
తప్పు మీదంటే మీదే
ప్రస్తుతం తప్పొప్పులు ప్రభుత్వం మీదకు కాకుండా ఉద్యోగ సంఘాల మీదకు మళ్లాయి. ఉద్యమ సమయంలో జేఏసీగా ఉన్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఇప్పుడు లేదనే చెప్పుతున్నారు. మరోవైపు ఉద్యోగ ఐక్య వేదిక కూడా తయారైంది. ఈ సమయంలో సీఎం దగ్గరకు వెళ్లేందుకు జేఏసీకి మాత్రమే దారి. అందుకే సీఎంతో మీటింగ్‌లో టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ సంఘాలే వెళ్లాయి. అంటే మిగిలిన సంఘాలకు పిలుపే లేదు. పిలుపు కాదు…సమాచారం కూడా లేదు. అందుకే సీఎం ప్లాన్ ప్రకారం ఉద్యోగ సంఘాల్లో చిచ్చు పెట్టినట్టే. ఇప్పుడు తెరపైకి వస్తున్న అంశం కూడా అదే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటున్నాయని ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. దీంతో అసలు విషయం పక్కదారి పట్టినట్టు అవుతోంది. సంఘాల మీద ఆరోపణలతో కాలం వెళ్లదీస్తే… క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు చెప్పేవారు ఉండటం లేదు. వీరి ఓట్లు ఎటు పడుతాయనేది లెక్క కట్టడం కష్టమే. ఇది కూడా ఒకరకమైన వ్యూహంగానే అంచనా వేస్తున్నారు.
మండలి స్టంట్… చాలా హాట్
మండలి ఎన్నికలు ఒక విధంగా ఉద్యోగ సంఘాలను ప్రగతిభవన్‌కి పిలిపించుకునేందుకు ఉపయోగపడ్డాయి. మొన్నటి వరకు ప్రగతిభవన్ నుంచి వచ్చే డైరెక్షన్‌లో మంత్రులు నటించారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం నేరుగా దిగారు. ఎక్కువ ఓట్లు ఉన్న ఉద్యోగులను పిలిపించుకున్నారు. ఓట్లు వేయించే బాధ్యత మీదే అన్నట్టుగా వారి నెత్తిపై వారి చేతులను పెట్టారు. మరోవైపు ఉద్యోగాల భర్తీపై సవాళ్లు సాగుతూనే ఉన్నాయి. లక్షన్నర ఉద్యోగాలిచ్చినట్లు టీఆర్‌ఎస్ లెక్కపత్రం లేని లెక్కలు చెబుతూనే ఉంది. ఉద్యోగాలు ఇవ్వలేదంటూ అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ మొత్తుకుంటున్నాయి.