అభిమానులా.. అధికారులా..?

by Shyam |

గతంలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనతను మన ముఖ్యమంత్రి సాధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఐఏఎస్​లు, ప్రభుత్వ విభాగాలు, ఇతర అధికారులను కూడా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేలా చేశారు. కేసీఆర్​ బర్త్​డే వేడుకలను నిర్వహించడంలో టీఆర్​ఎస్​ నాయకులను, కార్యకర్తలను వెనక్కినెట్టి మరీ అధికారులు ముందంజలో ఉన్నారు. ఇందుకోసం రెగ్యులర్​గా సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు సాధారణ కార్యక్రమాలను రద్దు చేసి కార్యాలయాలను వదిలి రోడ్ల మీద పడ్డారు. సోమవారం కేసీఆర్​ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధికారులా..? అభిమానులా..? అని అందరూ ముక్కున వేలు వేసుకునేలా చేశారు. సాధారణంగా ఈ పనిని టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు చేపట్టాలి. గతంలో పనిచేసిన వైఎస్​ఆర్​, చంద్రబాబు నాయుడు సహా ఏ ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లోనూ ప్రభుత్వ అధికారులు నేరుగా పాల్గొనలేదు. ప్రత్యేక అభిమానమున్న వారు ఒక్కరిద్దరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేవారు. కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలెవరూ హోర్డింగ్‌లు పెట్టొద్దని, తలా ఒక మొక్కను నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తన ట్విట్టర్​ ఖాతా ద్వారా కోరారు. దీన్ని అధికారులు తామే కార్యకర్తలమని భావించారో ఏమిటో మరి.. కేటీఆర్​ ఒక్కటి చెబితే తమ పవర్​, సిబ్బందిని ఉపయోగించి అంతకు మించి.. అన్నట్టు వందల్లో, వేలల్లో మొక్కలు నాటి అధికారులు అనుకుంటే ఎంతటి పనైనా సాధ్యమే అని సారు మీద తమకున్న ప్రేమ ఏంటో నిరూపించారు. సాధారణ పరిపాలనా పనులను సైతం ఆపేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​ కుమార్​, ప్రిన్సిపల్​ సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ, జిల్లా కలెక్టరేట్లు, మండల పోలీసు స్టేషన్లు సహా అధికారులంతా మొక్కలు నాటడంలో బిజీగా గడిపారు. దీంతో అవసరాల కోసం కార్యాలయాలకొచ్చే సాధారణ ప్రజలు అధికారులు లేక, పనులు జరగకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రగతిభవన్​లో కేసీఆర్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు టీఆర్​ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో మించి రాష్ట్రంలోని ఐఏఎస్​లు, ఐపీఎస్​లు పోటీ పడ్డారు. మరో అడుగు ముందుకేసిన హైదరాబాద్ నగరపాలక సంస్థ 150వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాట గచ్చిబౌలి స్టేడియంలో మియావాకి పద్ధతిని ఉపయోగించి ఒకే రోజు పది వేల మొక్కలు నాటడం విశేషం..
కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలను ఒక ఉద్యమంలా చేపట్టి మరే అత్యవసర పనులు లేనట్టు చేసిన ప్రభుత్వ అధికారుల్లో ఐఏఎస్​, ఐపీఎస్​ క్యాడర్​ కూడా ఉండటం బాధాకరం. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని ఓ కార్యక్రమంలో పోటీపడిన అధికారులు ప్రజలకు సేవలందించి తమ విధులను ఇదే స్థాయిలో కొనసాగిస్తే మన రాష్ట్రం సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది. ప్రభుత్వం, అధికారులపైనా ప్రజలకు నమ్మకం కలిగించిన వారవుతారు.

Advertisement

Next Story

Most Viewed