- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు ప్రమోషన్.. ప్లీనరీ సాక్షిగా తీర్మానం
“రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం రాష్ట్ర అధ్యక్షుడికే ఉంటుంది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల కార్యవర్గ కమిటీలను నియమించేది కూడా రాష్ట్ర అధ్యక్షుడే. పార్టీకి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆబ్సెన్సులో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఆ బాధ్యతలు సంక్రమించే విధంగా సవరణలు అవసరమని ప్లీనరీ భావించింది. ఈ మేరకు ప్రతిపాదిత తీర్మానం కూడా ప్లీనరీకి వచ్చింది. పార్టీ పనిని సులభతరం చేయడానికి, పార్టీ నిర్వహణ కోసమే ఈ సవరణ చేయాలని అనుకుంటున్నాం. ఇది క్లిష్టతరం కూడా కాదు” – ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ప్రమోషన్ వచ్చింది. ప్లీనరీ సాక్షిగా ఆయనకు అధ్యక్షుడు కేసీఆర్ అదనపు బాధ్యతలను అప్పగించారు. కేటీఆర్.. ఇకపై యాక్టివ్ రోల్ పోషించబోతున్నారు. దాదాపు అధ్యక్షుడికుండే అధికారాలతో యాక్టివ్ ప్రెసిడెంట్ కానున్నారు. ఈ మేరకు పార్టీ నిబంధనల్లోనే సవరణలు చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు ప్లీనరీ కూడా ఆమోదం తెలిపింది. హాజరైన ప్రతినిధులంతా చప్పట్లతో స్వాగతించారు. దీంతో ఇకపైన ప్రభుత్వాధినేతగా కేసీఆర్, పార్టీ అధినేతగా కేటీఆర్ వ్యవహరించనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. పేరుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఇకపై అధ్యక్షుడి తరహాలో కేటీఆర్ కీలక భూమిక పోషించబోతున్నారు.
ఫ్లెక్సీల్లో ఇద్దరి ఫొటోలే!
ప్లీనరీని ఘనంగా నిర్వహించే పేరుతో నగరంలో అన్ని కూడలి ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, తోరణాలు వెలిశాయి. నగరం మొత్తం పింక్ సిటీగా మారిపోయింది. అన్ని ఫ్లెక్సీల నిండా కేసీఆర్, కేటీఆర్ బొమ్మలే దర్శనమిచ్చాయి. ఒకటి అరా మినహా ఫ్లెక్సీల్లో హరీశ్‌రావు, కవిత బొమ్మలు కనిపించలేదు. ప్లీనరీకి కూడా వారు హాజరుకాలేదు. దాదాపు తండ్రీ కొడుకుల షో తరహాలోనే ముగిసింది. దీనికి బలం చేకూర్చే దిశలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ స్వయంగా కేసీఆర్ ప్రకటించడం, దానికి ఆమోదం లభించడం విశేషం. ఈ ప్లీనరీలో అటు హరీశ్‌రావు, ఇటు కవిత లేని సందర్భంలో ఈ సవరణ తీర్మానం ఆమోదం పొందడం గమనార్హం.
ప్లీనరీలో నినాదాల జోరు
పార్టీ ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లెక్సీల్లో హైలైట్ అయినట్లుగానే ప్లీనరీలో సైతం ప్రతినిధులు కేటీఆర్‌కు జై కొట్టారు. వేదికమీద ఉన్న నేతల్లో కొందరు వారి ప్రసంగాల్లో జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో పాటు జై కేటీఆర్ అనే నినాదాన్నీ చేర్చారు. ఉత్సాహంలో ఉన్న కొద్దిమంది ప్రతినిధులు ఏకంగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. పెద్దపెట్టున నినాదాలు కూడా చేశారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని అలాంటి నినాదాలు వద్దని వారించారు. తొలుత పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న కేటీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు దాదాపు ప్రెసిడెంట్ అధికారాలనే కట్టబెట్టారు. దీంతో ఇకపైన పాలనాపరమైన అంశాలకు మాత్రమే కేసీఆర్ పరిమితమై పార్టీ వ్యవహారాలన్నింటినీ కేటీఆర్‌కు కట్టబెట్టినట్లయింది. పార్టీ అధ్యక్షుడు లేని సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీపరంగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కేటీఆర్‌కు అప్పజెప్పనున్నట్లు ప్లీనరీ వేదికగానే చెప్పడంతో దాదాపుగా డీఫ్యాక్టో ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను కేటీఆర్‌కు అప్పజెప్పినట్లయింది.
కేటీఆర్‌కు స్వతంత్ర నిర్ణయాధికారం
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వరంగల్ విజయగర్జన సభ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తూ అన్ని నియోజకవర్గాల పార్టీ నాయకులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ప్లీనరీ వేదికగానే గ్రీన్ సిగ్నల్ లభించడంతో దాదాపు పార్టీ అధ్యక్షుడి పాత్ర పోషించనున్నారు. పార్టీ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ ఉంటున్నప్పటికీ త్వరలో ఢిల్లీ కార్యాలయం నుంచి జాతీయ స్థాయిలో వ్యవహారాలను చక్కదిద్దాలనుకుంటున్నందున రాష్ట్రంలో ‘అధ్యక్షుడి ఆబ్సెన్స్’ కారణంతో కేటీఆర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోడానికి మార్గం సుగమమైంది. పాలనా వ్యవహారాల్లో సీఎం హోదాలో కేసీఆర్ బిజీగా ఉంటున్నందున వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిర్ణయాలు తీసుకోడానికి కేటీఆర్‌కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. ఇకపైన హరీష్ రావు, కవిత, సంతోష్ తదితరులంతా కేటీఆర్ కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుందనే సంకేతమూ ఇచ్చినట్లయింది. ఎమ్మెల్యే నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఇప్పుడు దాదాపు యాక్టివ్ ప్రెసిడెంట్ పాత్రను పోషించనున్నందున త్వరలో సీఎం బాధ్యతలను అప్పజెప్పే అవకాశమూ లేకపోలేదన్న చర్చలు పార్టీలో మొదలయ్యాయి. ఇప్పటికే ఆయనను సీఎం చేయాలంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ వేదికల మీదనే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్లీనరీలో ప్లాకార్డులే దర్శనమిచ్చాయి. ఈ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో స్వయంగా కేసీఆర్ పక్కకు తప్పుకుని సీఎం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.