హుజురాబాద్‌లో మండుతున్న యెండల.. కోప్పడుతున్న కవ్వంపల్లి

by Sridhar Babu |
హుజురాబాద్‌లో మండుతున్న యెండల.. కోప్పడుతున్న కవ్వంపల్లి
X

దిశ, జమ్మికుంట: ‘వాళ్ల తప్పులే మా విజయానికి పూల బాట.. వాళ్లు, వాళ్ల పార్టీ విధానాలను ఎండగడుతాం.. ఏది ఏమైనా మేం గెలుస్తాం’ … ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నాయకులను కదలించినా ఇదే చెబుతున్నారు.. ఇవే మా గెలుపు అస్త్రాలు అంటున్నారు. ఎవరెవరూ ఏమంటున్నారో మీరే చూడండి.

ఈటల గెలుపు నిర్ణయం అయింది: యెండల

నాడు స్వరాష్ట్ర కల సాకారం కోసం రాజీనామా చేసి, నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ ను గెలిపించాలని హుజురాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతి అక్రమాలు, దోపిడీలను తాము ప్రచారస్త్రాలుగా ఎంచుకున్నామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనపై బీజేపీ ప్రజలకు వివరించేందుకు రంగంలోకి దిగబోతుందని ఆయన చెప్పారు. హుజురాబాద్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ గతంలో కనీవినీ ఎరగని రీతిలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పడరాని పాట్లు పడుతోంది.. కానీ, హుజురాబాద్ బిడ్డలు మాత్రం ఈటల వైపే ఉన్నారని యెండల పేర్కొన్నారు. అదేవిధంగా టైగర్ నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ లను అగౌరపర్చిన కేసీఆర్ విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన అంశాల పరంగా మాత్రమే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని, అవినీతి.. కుటుంబ పాలనపై నిలదీయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ విధానాలను ఎండగడుతాం: కవ్వంపల్లి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ విధానాలను ఎండగడుతామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో రెండు పార్టీల విధానాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. రెండు పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న అభిమానమే తమ అభ్యర్థి గెలుపునకు కారణం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ క్యాడర్ అంతా కూడా హుజురాబాద్ లో తమ అభ్యర్థిని గెలిపించేందుకు శ్రమించే విధంగా కార్యాచరణ రూపొందించనున్నామని, బుధవారం పీసీసీ పూర్తి స్థాయిలో ప్లాన్ చేయనుందని కవ్వంపల్లి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed