‘కారు’లోకి కౌశిక్‌ రెడ్డి.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన కార్యకర్తలు

by Anukaran |   ( Updated:2021-07-13 03:08:18.0  )
‘కారు’లోకి కౌశిక్‌ రెడ్డి.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన కార్యకర్తలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన నేతలకు అధికార పార్టీ టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్య పోటీ నెలకొంటుందని పలువురు పేర్కొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఆ పార్టీ కొంత సందిగ్ధంలో పడిందనే చెప్పవచ్చు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి పోటీ చేసి 61 వేలకు పైగా ఓట్లు సాధించారు. అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ డైలమాలో పడింది.

16న టీఆర్ఎస్‌లోకి కౌశిక్

కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో తన అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 14న హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేస్తారని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో వివిధ స్థాయిలకు చెందిన సుమారు 2 వేల మంది కార్యకర్తలు తన వెంట టీఆర్‌ఎస్‌లో చేరుతారని కౌశిక్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కౌశిక్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story