‘ఆల్ ఉమెన్ గరుడ’ టీమ్.. గెట్టింగ్ రెడీ!

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-10 04:36:48.0  )
‘ఆల్ ఉమెన్ గరుడ’ టీమ్.. గెట్టింగ్ రెడీ!
X

దిశ, ఫీచర్స్: పురుషులు చేసే కొన్ని పనులను మహిళలు చేయలేరనే విషయంలో కొంతమేర నిజం ఉన్నప్పటికీ, ఇప్పుడు అది నిజం కాదని నిరూపితం కాబోతోంది. ఈ మేరకు పలువురు మహిళలు ఇప్పటికే సమాజ కట్టుబాట్లు, సంప్రదాయ అడ్డంకులను ఆత్మస్థైర్యంతో అధిగమించి మహిళా లోకానికి స్ఫూర్తి‌ప్రదాతలుగా నిలుస్తున్నారు. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో విజయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో కఠినతరమైన ట్రైనింగ్ పూర్తి చేసుకుని యాంటీ టెర్రర్ ఆపరేషన్స్‌ కోసం కర్నాటక పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ‘గరుడ’ టీమ్‌లో చేరేందుకు శివంగులు సన్నద్ధమవుతున్నారు.

టెర్రరిజం కార్యకలాపాలను నిరోధించేందుకు కర్నాటక పోలీసులు 2010లో ‘గరుడ’ పేరిట యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో తొలిసారిగా మహిళలను భాగస్వాములు చేయాలని నిర్ణయం తీసుకున్న పోలీసు శాఖ, ఈ ఏడాది 50 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ‘ఆల్ ఉమెన్ గరుడ’ టీమ్ సిద్ధం చేయాలని భావించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం బెంగళూరు సెంటర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం కేంద్రంలో 17 మంది గ్రామీణ యువతులకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మధురవీణ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం వీరంతా ఆల్ ఉమెన్ కమాండో టీమ్‌లో చేరి, అక్కడ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్‌, అంతర్గత భద్రతా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అరగంటలో ‘గరుడ’

ఆయుధాల పనితీరు, పేలుడు పదార్థాల గుర్తింపు, షూటింగ్, రోప్ వాకింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వీరు ‘గరుడ’ టీమ్‌లో చేరనున్నారు. బెంగళూరు నగరంలో ఏ మూలనా ఏం జరిగినా అరగంటలో అక్కడికి గరుడ వేగంతో చేరుకుని, పరిస్థితులు చక్కబెడతారు. బెంగళూరు నగర కేంద్రంగానే వీరి విధులు ఉంటాయి. సున్నిత ప్రాంతాల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బాధ్యత తీసుకుని వీరు తమ ఆపరేషన్స్ కొనసాగించనున్నారు.

ఎక్స్‌పెన్సివ్ ట్రైనింగ్

‘గరుడ’ టీమ్‌లో చేరే యువతులకు ప్రభుత్వం అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఖరీదైన ట్రైనింగ్ ఇస్తోంది. ఈ మేరకు శారీరకంగా, మానసికంగా వారిని దృఢంగా తీర్చిదిద్దుతున్నారు. నిపుణుల చేత వెపన్స్ హ్యాండ్లింగ్ ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ ఉమెన్ గరుడ ఫోర్స్‌ మెంబర్స్ ఎలాంటి సిచ్యువేషన్‌ను అయినా చాకచక్యంగా డీల్ చేసే విధంగా ప్రేరణనిస్తున్నారు. రెండు నెలల ట్రైనింగ్ అనంతరం ఈ 17 మంది యువతులకు ఎగ్జామ్ ఉంండనుంది. అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ‘గరుడ’ టీమ్‌లో చేరుతారు.

Advertisement

Next Story