కర్ణాటక పీఠంపై ‘బసవరాజ బొమ్మై అను నేను’..

by Shamantha N |   ( Updated:2021-07-28 03:10:07.0  )
bommai-basavaraj
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వారసుడిగా, ఆ రాష్ట్ర 20వ సీఎంగా బొమ్మై బుధవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజ బొమ్మై కావడం విశేషం. యడ్యూరప్ప లానే బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్లే కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

లింగాయత్ వర్గం ఓట్లే బీజేపీని పలుమార్లు అధికారంలోకి తీసుకురావడానికి కీలకపాత్ర పోషిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక బసవరాజ బొమ్మై 1998-2008 వరకు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేయగా.. ఆ తర్వాత జేడీఎస్ నుంచి 2008 ఫిబ్రవరిలో బీజేపీ పార్టీలో బొమ్మై చేరారు. షిగ్గోన్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2008-13 వరకు నీటి వనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవం బొమ్మై సొంతం. బొమ్మై మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. కాగా, బొమ్మై ప్రమాణ స్వీకారం మాజీ సీఎం యడ్యూరప్ప సమక్షంలో జరగడం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ముందు కూడా యడ్యూరప్ప, బొమ్మై ఇద్దరూ హనుమాన్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed