గమ్యాన్ని చేరడమే వారి లక్ష్యం.. కూలీ కుటుంబానికి కరీంనగర్ పోలీసుల బాసట

by Sridhar Babu |
గమ్యాన్ని చేరడమే వారి లక్ష్యం.. కూలీ కుటుంబానికి కరీంనగర్ పోలీసుల బాసట
X

దిశ, మానకొండూరు : ఓ వైపున ఎండ మండిపోతోంది. మరో వైపున లాక్‌డౌన్ అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ముగ్గురు పిల్లలతో దంపతులు నిలబడి ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారిని అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ ప్రొబేషనరీ ఎస్సై గమనించారు. వారి వద్దకు వెల్లి వివరాలు అడిగి వారీ దీనావస్థను చూసి చలించిపోయారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గూనూరు చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న ఓ కుటుంబాన్ని పోలీసులు అక్కున చేర్చుకున్నారు. బాధితుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు వారికి ఆహారం అందించి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. కర్నాటకలోని యశ్వంతపూర్ దగ్గర ఉండే నేల్ మంగల్‌కు చెందిన బీరేందర్ సింగ్ మహారాష్ట్రలోని బల్లార్షా సమీపంలో గల లక్కడికోట్ వద్ద ఓ పౌల్ట్రీ ఫాంలో కూలీగా పని చేస్తున్నారు. నెలకు రూ. 12 వేల జీతం కోసం కర్నాటక నుండి మహారాష్ట్రకు వచ్చిన ఈయన తన భార్య పిల్లలను కూడా వెంటతీసుకొచ్చుకున్నాడు. ఆరు నెలల నుండి సూరజ్ పౌల్ట్రీ ఫాంలో పనిచేస్తున్న ఆయనకు రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వడం లేదు.

పౌల్ట్రీ రంగం కూడా దెబ్బతినడంతో యజమాని జీతం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పాడు. మహారాష్ట్రలో గత నెల రోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో వీరికి తిండి దొరకడం కూడా గగనంలా మారింది. దీంతో బీరేందర్ సింగ్ తన భార్య సునితా థామస్ కొడుకు ఎలెన్ (11), కూతురు ఎలిసా (5) మోనాలిసా (2)లను తీసుకుని కర్నాటక వెళ్లేందుకు కాలినడకన బయలు దేరాడు. ఐదు రోజుల క్రితం లక్కడికోట్ నుండి బయలు దేరిన ఆయన కుటుంబం ఆదివారం అల్గునూరుకు చేరుకుంది. లక్కొడికోట్ నుండి వస్తుండగా అక్కడక్కడ ప్రైవేటు వాహనదారులను ఆశ్రయించి వారు దింపిన తరువాత నడుచుకుంటూ వచ్చారు. అల్గునూరు చేరుకున్న వీరిని గమనించిన ప్రొబెషనరీ ఎస్సై అజాహరుద్దీన్ వివరాలు అడిగి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే సమీపంలోని నర్సరీ యజమానితో మాట్లాడి భోజనం ఏర్పాటు చేయించారు. సాయంత్రం వరకు వారిని అక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్తున్న లారీలో పంపించారు. ఎస్సై ప్రమోద్ రెడ్డి కూడా వారికి బాసటగా నిలిచి తనవంతు సాయాన్ని అందించారు.లాక్‌డౌన్ సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న తరుణంలో కూలీలను అక్కున చేర్చుకున్న ఖాకీలను చూసి పలువురు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed