వీవీ ప్యాట్‌ ఎఫెక్ట్‌తో కరీంనగర్ హై అలర్ట్

by Sridhar Babu |
వీవీ ప్యాట్‌ ఎఫెక్ట్‌తో కరీంనగర్ హై అలర్ట్
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం తరలించిన వీవీ ప్యాట్ ఎఫెక్ట్ నగరంలో స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. లెక్కింపు కోసం జిల్లా కేంద్రానికి తరలించిన ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంకు అదనపు భద్రత కల్పించారు. లెక్కింపు కేంద్రంతో పాటు స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఎస్‌ఆర్ఆర్ కళాశాల పోలీసుల వలయంలోకి వెళ్ళింది. సాధారణ పౌరులే కాదు, కళాశాల సిబ్బందిని కూడా ఆవరణలోకి భద్రతా సిబ్బంది వెళ్లనీయడం లేదు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు తరలిస్తున్న బస్సులు జమ్మికుంట బ్రిడ్జి వద్ద నిలిపివేయడం, పని చేయని వీవీ ప్యాట్‌లను ఇతర వాహనంలో తరలించడం లాంటి ఘటనలు జిల్లా యంత్రాంగం పై తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

వీటికి తోడు అధికార పార్టీ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారంటూ, బీజేపీ శ్రేణులు కూడా ఆరోపణలు చేయడం, ఆదివారం పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలకు దిగాయి. దీంతో పరిస్థితులను అంచనా వేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుగా ప్రకటించిన మేరకు కాకుండా, భద్రతను మరింత పెంచింది. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రధాన కూడళ్లలో బలగాలను మోహరించింది. ఈవీఎంలు భద్రపర్చిన ఎస్ఆర్‌ఆర్ కళాశాల ఎదుట శనివారం అర్ధరాత్రి బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ కూడా భద్రత పెంచారు. మునుపెన్నడూ లేనివిధంగా కళాశాల పక్కనే ఉన్న మైదానం, పరిసర ఇళ్ల సమీపంలో కూడా అదనపు బలగాలను దించారు.

Advertisement

Next Story

Most Viewed