అప్పుడలా.. ఇప్పుడిలా..

by Sridhar Babu |
అప్పుడలా.. ఇప్పుడిలా..
X

దిశ, కరీంనగర్: ఒకప్పుడు అక్కడ ఎప్పుడు చూసినా నిత్యం రద్దీగా గజిబిజిగా ఉండేది. కానీ, ఇప్పుడది రూపాంతరం చెంది ప్రశాంత వాతావరణంలో ప్రజలకు సేవలందిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ పాతగుర్తులు నెమరేసుకుంటున్నారు. అదేమిటో చూడండి..

24 గంటలూ బస్సుల హారన్లు, ప్రయాణికులతో కిటకిటలాడుతూ, ఓ వైపున కంట్రోలర్ అనౌన్స్ మెంట్ మరో వైపున కండక్టర్లు, డ్రైవర్లు జేబీఎస్.. జేబీఎస్, వరంగల్ వరంగల్ అంటూ అరుపులు, బస్సు మిస్సవుతుందని కంగారుగా పరిగెత్తుకుంటూ ప్లాట్ ఫాంపైకి చేరుకునే ట్రావెలర్స్ ఇది నిన్నమొన్నటి కరీంనగర్ ఆర్టీస్ బస్ స్టాండ్ లో నెలకొన్న పరిస్థితి.

వంకాయలు వంకాయలు, టమాట టమాట, బీర కాయలు బీర కాయలు, నేను అగ్వకు ఇస్తానంటే కాదు నేనే అగ్వకు ఇస్తా ఇంటికి పోతా గంప గుత్తకు తీసుకో సారూ అంటూ మరొకరు, అంత రేటా తగ్గించి ఇయ్యరాదు అంటూ వినియోగదారుల ప్రశ్నలు, మరోవైపున సామాజిక దూరం పాటిస్తూ క్యూ కట్టిన జనం ఇది నేడు బస్ స్టాండ్ లో నెలకొన్న పరిస్థితి.

వందల సంఖ్యల బస్సులు ప్రయాణికుల రాకపోకలతో కళకళలాడిన కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఇప్పుడు తాత్కాలిక కూరగాయల మార్కెట్ గా రూపాంతరం చెందింది.

కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఉదయం వేళల్లో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం కొంత సమయం ఇవ్వడంతో ప్రజలు ఉదయం పూట మార్కెట్లలోకి వెళుతున్నారు. సమయం ముగిసిపోతుందన్న ఆందోళనతో ప్రజలు గుంపులుగుంపులగా కూరగాయలు కొంటున్నారు. సామాజిక దూరం పాటించకుండా కొనుగోలు చేస్తున్న విషయాన్ని గమనించిన అధికారులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు సూచించారు.

మంత్రి సూచించినా మారలేదు..

మంత్రి గంగుల కమలాకర్ కూడా మార్కెట్లను పరిశీలించి ప్రజలకు విన్నవించినా ఫలితం కనిపించ లేదు. చివరకు గుంపులుగా ఉంటే కఠిన చర్యల తీసుకుంటామని కూడా హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. ప్రత్యామ్నాయం మార్గం ఆలోచించిన అధికారులు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న మెయిన్ మార్కెట్ ను కరీంనగర్ బస్ స్టాండ్ కు తరలించారు. దీంతో కూరగాయల క్రయవిక్రయాలతో బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. అధికారులు తాత్కాలిక కూరగాయలను ఏర్పాటు చేసి ఇక్కడ 72 దుకణాలు ఏర్పాటు చేయించారు. నిన్న మొన్నటి వరకు ప్రయాణీకులను తరలించే బస్సుల రాకపోకలకు వేదికగా నిలిచి ప్రయాణీకులకు సేవలందించిన కరీంనగర్ బస్ స్టాండ్ నేడు కూరగాయల మార్కెట్ గా రూపాంతరం చెంది ప్రజలకు సేవలందిస్తోంది. నాడు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిని పంపించేందుకు దోహదపడ్డ బస్ స్టాండ్ నేడు స్థానికుల కూరగాయల మార్కెట్ గా మారి సేవలందిస్తోంది.

Tags: Karimnagar Bustand, Vegetable Market, Authorities, Consumers, Social Distance, Corona Effect

Advertisement

Next Story

Most Viewed