రికార్డు.. అమెరికా ప్రెసిడెంట్‌గా 77 ఏళ్ల బైడెన్!

by Shyam |
రికార్డు.. అమెరికా ప్రెసిడెంట్‌గా 77 ఏళ్ల బైడెన్!
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త రికార్డు నమోదైంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. దీంతో అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అధికారం చేపట్టానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దాటేసినట్లు అమెరికా మీడియా సంస్థలన్నీ వెల్లడించాయి. జో బైడెన్ విజయానికి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే అవసరమయ్యాయి. కీలకమైన పెన్సిల్వేనియా, నెవాడా రాష్ట్రాల్లో డెమొక్రాట్లు విజయం సాధించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలపి 26 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.

దీంతో జోబైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లతో ఘన విజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకుగాను అధికారం చేపట్టడానికి 270 ఓట్లు మాత్రమే అవసరం. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. పెన్సిల్వేనియా, నెవెడా రాష్ట్రాల్లో విజయం సొంతం కావడంతో జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. ఇక్కడే బై‌డెన్ ఓ రికార్డును నెలకొల్పారు. 77 ఏళ్ల వయస్సులో (కురువృద్దుడు) అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. గతంలో అమెరికాకు ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారెవరికీ ఇంత వయస్సు లేదని అమెరికా వర్గాలు తెలిపాయి. కాగా, భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయనుండటం కూడా విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా రికార్డు సృష్టించబోతున్నారు.

ఆ రాష్ట్రాల్లో దోబుచులాట..

ఈ నెల 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగ్గా అదేరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించగా, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడన్ 264 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చారు. కానీ, స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా(20), జార్జియా(16), నార్త్ కరోలినా(15), నెవాడా(6), అలస్కా(4) ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్లు ఫలితాల సరళి కొనసాగింది. ఒక్క నెవెడా మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగారు. గురువారం నుంచీ ఫలితాల్లో మార్పు మొదలైంది. జార్జియా(16)లో ఇద్దరు అభ్యర్థుల మధ్య 0.5 శాతం కంటే తక్కువ తేడా ఉండటంతో రీకౌంటింగ్ చేపట్టారు.

అయితే, పెన్సిల్వేనియా, నెవెడా రాష్ట్రాల్లో జో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. చివరికి జో బైడెన్ 49.7 శాతం ఓట్లతో పెన్సిల్వేనియాలో విజయం సాధించారు. దీంతో ఆయన ఖాతాలో 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చి చేరాయి. మ్యాజిక్ ఫిగర్ 270ను దాటేయడంతో డెమొక్రట్లు సంబరాలు చేసుకున్నారు. నెవెడాలో కూడా జో బైడెన్ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో ఆయన ఖాతాలో మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు వచ్చి చేరాయి. దీంతో 290 ఎలక్టోరల్ ఓట్లను సాధించిన డెమొక్రట్ అభ్యర్థి 300 ఓట్ల ఆధిక్యం దిశగా సాగుతున్నాడు. జార్జియాలో రీకౌంటింగ్ జరుగుతుండగా, నార్త్ కరోలినా, అలస్కాలో డొనాల్డ్ ట్రంప్‌కు ఆధిక్యం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed