ప్రభుత్వం చెప్పే వరకు పరీక్ష లొద్దు

by Shyam |   ( Updated:2020-06-12 10:53:35.0  )
ప్రభుత్వం చెప్పే వరకు పరీక్ష లొద్దు
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇతర కోర్సుల పరీక్షల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ఎలాంటి పరీక్షలను నిర్వహించవద్దని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని అనుబంధ కళాశాలల, అటానమస్ కళాశాలల ప్రిన్సిపాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదని, అలాంటి నిర్ణయం వెలువడేంత వరకు మిడ్-టర్మ్ పరీక్షలను కూడా నిర్వహించవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకునేంతవరకు విద్యార్థులకు కూడా స్పష్టత ఇవ్వాలని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, దానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి జేఎన్‌టీయూ నుంచి ఈ ప్రకటన వచ్చినా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు కూడా త్వరలో ఇదే తరహా ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు యూనివర్సిటీల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నందున ఈ రెండు యూనివర్సిటీలకు కూడా పరీక్షల నిర్వహణ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున అన్ని వర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాలే పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి వర్సిటీల యూజీ, పీజీ పరీక్షల భవితవ్యం ఆధారపడి ఉంది.

Advertisement

Next Story

Most Viewed