వీవో వీడితేనేం.. స్వదేశీ కంపెనీలు రెడీ

by  |
వీవో వీడితేనేం.. స్వదేశీ కంపెనీలు రెడీ
X

దిశ, స్పోర్ట్స్: ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవరోధాలు.. అన్నీ అధిగమించి ఎట్టకేలకు యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు బీసీసీఐ సిద్ధమైంది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో టైటిల్ స్పాన్సర్ వీవో వైదొలుగుతున్నట్లు ప్రకటించడం బోర్డును షాక్‌కు గురిచేసింది. ఇప్పటికిప్పుడు మరో స్పాన్సర్‌ను పట్టడం అసాధ్యమనుకున్నారు. కానీ, మేమంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ భారతీయ కంపెనీలు బీసీసీఐని సంప్రదించడం విశేషం. జియో లేదా పతాంజలి ఏదో ఒక సంస్థ ఐపీఎల్ స్పాన్సర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఐదేండ్లపాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించడానికి బీసీసీఐతో రూ.2199కోట్లకు వీవో ఒప్పందం చేసుకుంది. భారత్, చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, సంస్థలపై భారతీయుల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో టిక్‌టాక్, హలో తదితర 59 చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వీవో వ్యవహరిస్తుండటంపై బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు వీవో ప్రకటించింది.

మేమున్నాం..

మరో ఐదు వారాల్లో ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా వీవో అనూహ్య నిర్ణయంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ వేటలో పడింది. మన దేశానికి చెందిన జియో, పతాంజలి స్పాన్షర్‌గా ఉండటం కోసం ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా మునుపటిలా టోర్నీకి ఆదరణ లభించకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీవో తరహాలో కొత్త స్ఫాన్సర్ అంత భారీ మొత్తాన్ని చెల్లించకపోవచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వీవో తప్పుకున్నా కొత్త స్పాన్సర్ల వల్ల నష్టమేనని తెలుస్తున్నది. ప్రతి ఏడాది రూ. 440 కోట్ల చొప్పున ఐదేండ్లకుగాను రూ. 2199 కోట్ల ఒప్పందాన్ని వీవో కుదుర్చుకుంది. కొత్త టైటిల్ స్పాన్సర్ నుంచి బీసీసీఐకి ఇంత మొత్తం పొందకపోవచ్చని అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed