నాన్‌స్టాప్ బర్డ్ ఫ్లై @12 వేల కిలోమీటర్లు

by Shyam |
నాన్‌స్టాప్ బర్డ్ ఫ్లై @12 వేల కిలోమీటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా వేల మైళ్లు ప్రయాణించే పక్షిగా ‘గాడ్‌విట్’కు పేరుంది. అయితే, ఈ వలస పక్షులు ప్రయాణించగలిగే దూరాలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు శాస్ర్తవేత్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ గాడ్‌విట్ పక్షి.. బ్రేక్ తీసుకోకుండా 12 వేల కిలోమీటర్లు ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించింది.

పొడవైన తోక కలిగిన గాడ్‌విట్ పక్షి.. సెప్టెంబర్‌ 16న సౌత్ వెస్ట్ అలస్కా నుంచి బయలుదేరి, పదకొండు రోజుల తర్వాత న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చేరుకుంది. ఇది గంటకు 88 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం విశేషం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. ఈ పక్షి ఎక్కడా కూడా నిద్రించలేదు, ఆహారం కోసం ఆగిపోలేదు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకుంది. సాధారణంగా గాడ్‌విట్‌లు వలస పక్షులు. సీజన్‌ను బట్టి ఇవి తమకు అనువుగా ఉండే ప్రదేశాలకు వెళుతుంటాయి.

గాడ్‌విట్ పక్షి ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి శాస్త్రవేత్తలు దీనికి 5 గ్రాముల శాటిలైట్‌ను అమర్చారు. అంతేకాదు దీన్ని ఈజీగా గుర్తించడానికి 4 బీబీఆర్‌డబ్ల్యూ (బ్లూ, బ్లూ, రెడ్, వైట్) రింగ్స్‌ను దాని కాళ్లకు బిగించారు. ఈ పక్షి 190 నుంచి 400 గ్రాముల బరువుంటుంది. అలెంటియా ఐలాండ్, పసిఫిక్ ఓషియన్, హవాయి, ఫిజి మీదుగా దాని ప్రయాణం సాగింది. ఈ పక్షికి సంబంధించిన పాయింట్ టు పాయింట్ ఫైట్‌ను ఆ శాటిలైట్ రికార్డు చేసింది. మొత్తం 12,845 కిలోమీటర్లు ప్రయాణించగా.. అది గాల్లో చక్కర్లు కొట్డడం, ఇతర కారణాల వల్ల.. 12,200 కిలోమీటర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. మొత్తంగా 224 గంటల్లో అది 12,200 కిలోమీటర్లు ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించింది. 2007లో లాంగెస్ట్ నాన్ స్టాప్ బర్డ్ ఫ్లై రికార్డు 11,680 కిలోమీటర్లుగా నమోదైంది. కానీ అప్పుడు ఫిమేల్ గాడ్‌విట్ పేరు మీద ఈ రికార్డు నమోదైతే.. ప్రస్తుతం మేల్ గాడ్‌విట్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

పసిఫిక్ సముద్రం మీదుగా రోజుల తరబడి ప్రయాణించినా, ఎక్కడ కూడా అవి ల్యాండ్ కాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Next Story