జపనీస్ భాషను అనువదించే మాస్క్!

by Harish |
జపనీస్ భాషను అనువదించే మాస్క్!
X

కరోనా కారణంగా మాస్క్‌లు నిత్యజీవితంలో భాగమయ్యాయి. అయితే ఈ మాస్క్‌లకు కూడా ఫ్యాషన్ జోడించి, కొత్త రకాలైన మాస్క్‌లు ట్రెండ్ చేస్తున్నారని గతంలో మనం చర్చించుకున్నాం. అయితే ఇదే మాస్క్‌కు కొద్దిగా టెక్నాలజీని జోడించి జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ.. జపనీస్ భాషను ఎనిమిది భాషల్లోకి అనువదించగల మాస్క్‌ను తయారుచేసింది. పైకి ఇది సాధారణ ఫేస్ మాస్క్‌‌లాగే కనిపిస్తున్నా, వినిపించే మాటలను ట్రాన్స్‌లేట్ చేసి, మొబైల్‌కి సందేశాల రూపంలో పంపిస్తుంది. ఇందుకోసం మాస్క్‌ ఎల్లప్పుడూ మొబైల్‌కు బ్లూటూత్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది.

ఈ స్మార్ట్ మాస్క్‌ను ‘డోనట్ రోబోటిక్స్’ అనే సంస్థ రూపొందించింది. కరోనా మహమ్మారికి ముందు ఈ సంస్థకు టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టుతో రోబో గైడ్స్, ట్రాన్స్‌లేటర్లకు సంబంధించి ఒక ప్రాజెక్టు ఉండేది. కానీ మహమ్మారి కారణంగా ఆ ప్రాజెక్టు కోల్పోయి, కంపెనీ నష్టాల్లో పడింది. దీంతో ఆ ప్రాజెక్టు కోసం రూపొందించిన టెక్నాలజీకి కొద్దిగా మార్పులు చేసి, ఈ స్మార్ట్ మాస్క్‌ తయారుచేసినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టైసుకె ఒనో తెలిపారు. ఈ మాస్క్‌ కేవలం ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే కాకుండా మెసేజ్‌లు పంపించడానికి, వేసుకున్న వ్యక్తి మాటను మార్చి వినిపించడానికి కూడా ఉపయోగపడుతుందని ఒనో వివరించారు. ఈ సెప్టెంబర్ నుంచి మొదటి 5000 మాస్క్‌లను కొనుగోలుదారులకు పంపిస్తున్నట్లు ఒనో వెల్లడించారు. తర్వాత ఇవే మాస్క్‌లను చైనా, అమెరికా, యూరప్‌లకు కూడా పంపించనున్నట్లు చెప్పారు. ఒక్క మాస్క్‌కు 40 డాలర్ల చొప్పున ధరను నిర్ణయించి, మార్కెట్లో అమ్మనున్నట్లు ఒనో ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed