చైర్మన్ పీఠంపై టీడీపీ, వైసీపీ కన్ను.. జనసేన అభ్యర్థే కీలకం

by srinivas |
ap muncipal elections
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది. అయితే సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలోని మైదుకూరులో మాత్రం ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 24 కౌన్సిలర్ స్థానాలు ఉండగా.. టీడీపీ 12 స్థానాల్లో విజయం సాధించగా.. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఒక స్థానంలో మాత్రం జనసేన అభ్యర్థి విజయం సాధించారు. దీంతో మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా మారింది. జనసేన పార్టీ అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది.

జనసేన అభ్యర్థి మద్దతుపై ఇరు పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ జనసేన అభ్యర్థి వైసీపీకి మద్దతు తెలిపితే ఎంపీ , ఎమ్మెల్యేల ఎక్స్ అఫిషియో ఓట్ల సాయంతో వైసిపి చైర్మన్ పీఠం దక్కించుకుంటుంది. ఒకవేళ జనసేన అభ్యర్థి టిడిపికి మద్దతు తెలిపితే అప్పు డు టిడిపి 13 స్థానాలతో, ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లు తో కలిపి వైసిపి 13 స్థానాలు లో సమానంగా నిలుస్తాయి. అప్పుడు టాస్ ద్వారా చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఏదిఏమైనా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. అయితే వైసిపి నాయకులు మాత్రం చైర్మన్ పీఠం తాము కైవసం చేసుకుంటామని ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story