ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ పవన్ కల్యాణ్

by srinivas |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ పవన్ కల్యాణ్
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం పాక్షికంగా సడలించడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే ఏపీలో పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంపై తీవ్ర దుమారం రేగుతోంది.

ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద విధులేంటంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం దృష్ట్యా ఇలాంటి విధులు సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం సబబుగా ఉంటుంది కానీ, ఇలా మద్యం దుకాణాల వద్ద విధులేంటని ఆయన నిలదీశారు.

ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయాలకు, ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. జీవనోపాధి కోల్పోయారన్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి లాక్‌డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను చూసే తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారని ఆయన ఎద్దేవా చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీగా మారిందని ఆయన విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి వైఎస్సార్సీపీ తూట్లు పొడించిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చాక విడతల వారీగా మద్య నిషేధం అంటున్నారని, ఇలాంటి సమయంలో మద్య నిషేధం అమలు చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా పొడవాటి క్యూలో జనాలు నిల్చుని కరోనా వైరస్ నిషేదం స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.

సామాజిక దూరం పాటించడం కష్టమంటూ ఆలయాలు, చర్చిలు, మసీదులను బలవంతంగా మూసేసిన ప్రభుత్వానికి లిక్కర్ షాపుల దగ్గర సామాజిక దూరం పాటించకపోతే ఫర్వాలేదా? అని ఆయన ప్రశ్నించారు. మద్యం విక్రయాలకు సామాజిక దూరం లేకపోయినా పర్వాలేదా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్యం దుకాణాలను తెరచిన రోజే ఆత్మహత్యలు చోటుచేసుకోవడం కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: janasena, ysrcp, jagan, liquor shops, pawan kalyan

Advertisement

Next Story

Most Viewed