జగిత్యాల ఎస్పీ సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు ‘SI’లపై వేటు

by Sridhar Babu |   ( Updated:2021-06-30 02:50:14.0  )
Sp-Sindhu-sharma
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఏసీబీ వరుస దాడులతో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ క్షేత్ర స్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం ఆరంభించారు. ఇటీవల కాలంలో జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ, కథలాపూర్ ఎస్ఐ పృథ్వీథర్ గౌడ్, కానిస్టేబుల్ రమేష్‌లు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీకి చిక్కారు. దీంతో, అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గురించి ఆరా తీయించిన ఎస్పీ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం ముగ్గురు ఎస్‌ఐలను అటాచ్డ్ చేశారు. అయితే, జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ వరుస దాడులు అధికారులను అలర్ట్ చేశాయి. దీంతో, ఎస్పీ సింధూ శర్మ అవినీతికి పాల్పడుతున్న పోలీసుల డాటా సేకరించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.

ఇంతటితో ఆగేనా..?

ఏసీబీ దాడుల నేపథ్యంలో ఎస్పీ సింధూ శర్మ ప్రత్యేకంగా చేయించిన విచారణలో ఎంతమంది గుట్టు దాగుందోనన్న ఆందోళన జిల్లా పోలీసు వర్గాల్లో మొదలైంది. నిన్నమొన్నటి వరకూ చూసి చూడనట్టుగా వ్యవహరించిన ఎస్పీ.. ఏసీబీ రైడ్స్‌తో కొరడా ఝులిపించడం ప్రారంభించారు. అయితే, ఏఏ స్టేషన్లలో ఎంతమంది అవినీతిపరులు ఉన్నారన్న వివరాలు సేకరించిన ఎస్పీ.. విడుతల వారీగా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

గ్రేడ్స్‌గా విభజన..?

జిల్లా పోలీసు యంత్రాంగంలో అవినీతికి పాల్పడుతున్న వారికి ప్రత్యేకంగా గ్రేడ్‌లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అత్యంత అవినీతి పరులై ఫస్ట్ ఫేజ్‌లో వేటు వేసి.. ఆ తరువాతి స్థానంలో ఉన్న వారిపై రెండో విడతలో క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఓ వైపున ఏసీబీ.. మరో వైపున ఎస్పీ చర్యలతో జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగంలో ఉలిక్కి పాటు మొదలైందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed