ఎస్పీ సింధుశర్మ ఆదేశం.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు

by Sridhar Babu |
Jagithyal DSP Prakash
X

దిశ,జగిత్యాల: లారీని చోరీ చేసి విడిభాగాలుగా విక్రయిస్తున్న ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో సాగిన ఈ దర్యాప్తులో జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పది రోజుల్లోనే కేసును పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాష్ ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణ శివారులోని చల్ గల్ పరిసరాల్లో ఈ నెల 15 ఓ లారీ చోరీకి గురైంది. అదే రోజు లారీ యజమాని మహ్మద్ అబ్బాస్ జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

జగిత్యాల రూరల్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న క్రమంలో లారీ చోరీకి గురైన ప్రాంతంలోనే సంబాని గజనన్ బిస్లే అనే వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను చోరీ చేసి లారీని నాందేడ్‌కు తరలించానని తెలిపాడు. దీంతో దర్యాప్తు బృందం నాందేడ్ వెళ్లి చూడగా.. చోరీ అయిన లారీని విక్రయించేందుకు విడి భాగాలుగా చేసినట్లు గుర్తించారు. అక్కడే తచ్చాడుతున్న గౌస్ ఖాన్ అనే మరో వ్యక్తిని విచారించగా, దీనికి సంబంధించిన లారీ టైర్లు తాను కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

Lorry

దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ ప్రకాష్ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.4లక్షలను రికవరీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గజనన్, గౌస్ ఖాన్‌ను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను వేగవంతంగా, చాకచక్యంగా పూర్తి చేసి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ అనిల్‌తో ఇతర ఎస్ఐలు, పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed