మేనమామ కిట్ @ 600 కోట్లు

by Ramesh Goud |
మేనమామ కిట్ @ 600 కోట్లు
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుకను వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి పిల్లలకు అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు ఆసరాగా నిలిచే ఈ పథకాన్ని సకాలంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ప్రభుత్వ, ఎయిడెడ్, మదర్సాలలో విద్యనభ్యసించే వారందరికీ జూన్ ఆరంభానికి ఈ కిట్లు అందజేసే చర్యలు చేపట్టింది.

గత వారం కర్నూలులో జరిగిన సభలో జగన్ మామయ్యా అని సంభోదిస్తూ విద్యార్థిని చేసిన ప్రసంగానికి ప్రశంసల జల్లు కురిపిస్తూ ‘మేనమామగా మీ బాధ్యత నాది’ అంటూ ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు భరోసానిచ్చిన సంగతి తెలిసిందే. దానిని నిజం చేస్తూ జూన్ ఆరంభం నాటికి జగనన్న విద్యాకానుక అందజేసేందుకు అడుగులు వేస్తున్నారు.

జగనన్న కిట్‌లో పాఠ్యాపుస్తకాలు అంటే టెస్టు, నోట్ పుస్తకాలు, మూడు జతల బట్టలు, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగును అందించనున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు వీటిని అందజేయనున్నారు. ఈ కిట్ అందజేసేందుకు ఒక్కో విద్యార్థికి సగటున 1350 రూపాయల నుంచి 1550 రూపాయలు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేస్తోంది.

ప్రభుత్వం పాఠశాలల్లో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో తెస్తున్న సంస్కరణల కారణంగా మరో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే కేవలం ఈ పథకానికి ఒక్కదానికే ఏడాదికి సుమారు 600 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.

మరోవైపు 12 వేల కోట్ల రూపాయలతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపేందుకు ప్రోత్సాహకంగా 43 లక్షల మంది తల్లులకు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు మీడియా స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇది మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. వేసవి సెలవుల్లో టీచర్లకు అదనపు ట్రైనింగ్ క్లాస్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు లేవు. విద్యావిధానంలో సంస్కరణలు అంటే ఆటపాటలపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఏతావాతా విద్యారంగ సమూల మార్పులకు జగన్ నాంది పలుకుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed