ఆరు జిల్లాలకు ఆరోగ్య శ్రీ విస్తరణ

by  |
ఆరు జిల్లాలకు ఆరోగ్య శ్రీ విస్తరణ
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అమరావతిలోని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరు జిల్లాలకు ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య శ్రీలో మార్పులు చేశామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించామని అన్నారు. ఈ మార్పులతో పైలట్ ప్రాజెక్టుగా గత జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని చెప్పారు. కరోనాను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆస్పత్రుల సేవలను బట్టి గ్రేడింగ్ విధానం అమలు చేస్తామని జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదని ఆయన ఆకాంక్షించారు. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీని వర్తించేలా చేస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులన్నింటికీ గత టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 680 కోట్ల రూపాయల బకాయిలన్నింటినీ గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఆరోగ్య శ్రీలో ఇప్పటి వరకు 1059 ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందే వెలుసుబాటు ఉంటే..దానిని తొలుత 2059కి పెంచి, కేన్సర్, కాంక్లియర్ ఇంప్లాంట్ వంటి చికిత్సలను కూడా జత చేసి ఇప్పుడు దానిని 2200 ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందేలా మార్పులు చేర్పులు చేశామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సేవలు పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రమే అందుబాటులో ఉంటే నేటి నుంచి విజయనగరం, విశాఖపట్టణం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేయనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో 42 లక్షల మందికి ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వాసుపత్రుల్లో ఇస్తున్నామని ఆయన తెలిపారు.

కరోనాపై మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్య శ్రీ కిందకు తెచ్చామని జగన్ చెప్పారు. కరోనాకి వ్యాక్సిన్ వచ్చేంత వరకు వైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. కరోనాపై విస్తృత అవగాహన తీసుకురావాల్సిందేనని ఆయన చెప్పారు. కరోనా వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్నదానిపై అవగాహన ప్రజల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా సోకిందని తేలగానే ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరిని సంప్రదించాలి? కరోనా పరీక్ష నిర్థారణ కేంద్రాలు ఎక్కడున్నాయి? అన్ని వివరాలు ప్రజలకు తెలియాల్సిన
అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ సోకిన వాళ్లలో 85 శాతం మందికి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవడం ద్వారా నయమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గ సౌకర్యాలు లేని వారిని కొవిడ్ సెంటర్లకు తరలిస్తే తాము వారిని చూసుకుంటామని అన్నారు. వైద్యులు అందుబాటులో ఉంటారు. కలెక్టర్లు దీనిపై పని చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వైద్య రక్షణ ఉండాలన్న ఆలోచనతోనే ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపర్చామని ఆయన
చెప్పారు.

వైఎస్సార్ ఆసరా కింద చికిత్స తీసుకున్న వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రోజూ 225 రూపాయలు, నెలకు 5 వేల వరకు ఇస్తున్నామని ఆయన తెలిపారు. 5 లక్షల వార్షికా ఆదాయం అంటే నెలకు 40 వేల జీతం ఉన్న వ్యక్తిని కూడా ఆరోగ్య శ్రీలోకి చేర్చామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే 1.4 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఆరోగ్య డేటా మొత్తం సేవ్ చేయడం ద్వారా భవిష్యత్‌లో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రయాణ ఆంక్షలు లేని నేపథ్యంలో రాకపోకలు పెరుగుతాయని దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతాయని ఆయన అంచనా వేశారు.


Next Story

Most Viewed