కొత్త ఫోన్లలో ఇది తప్పనిసరి… ప్రభుత్వ ఆదేశం

by sudharani |
కొత్త ఫోన్లలో ఇది తప్పనిసరి… ప్రభుత్వ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్య సేతు యాప్… కరోనా మహమ్మారికి ముందు ఇది లేదు. కానీ కరోనా తర్వాత ఇది కచ్చితంగా అందరి ఫోన్లలో ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉండబోతుందట కూడా. ఒకవేళ అలా లేకపోతే కొత్త ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అధికారిక నిబంధనను కేంద్రం త్వరలో తీసుకురానుంది. అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఈ ఏజెన్సీ సమన్వయం చేసుకుని, యాప్ ప్రీ ఇన్‌స్టాల్ అయ్యేలా చూసుకుంటుంది.

ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. అందరూ బాగానే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడో కొంతమంది ఇంకా దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోలేదు. దీంతో దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌బిల్ట్ ఫీచర్ కింద అందివ్వనున్నారు. ఈ యాప్‌ను ఇప్పటికే 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫీచర్ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Tags – corona, covid, aarogya setu, pre installed, mobile, SIM, smartphone, download

Advertisement

Next Story