నవ వధువు.. భయం వీడు.. ఆత్మీయతతో అన్నీ సాధ్యం

by Shyam |
bride
X

దిశ, ఫీచర్స్ : ఎవరి జీవితంలోనైనా ‘పెళ్లి’ ఒక అందమైన అనుభవం. ఎన్నో ఆశలు, ఊసులతో మొదలైన వైవాహిక జీవితం సాఫీగా సాగాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే పెళ్లయ్యాక కన్నవారిని, పుట్టింటిని వదిలి వచ్చే నవ వధువుకు మెట్టినిల్లు ఓ కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. అత్తింటి కట్టుబాట్లకు, అక్కడి వాతావరణానికి సర్దుబాటు కావడం నిజంగా ఆమెకు సవాలే. కొత్త ఇంటి సభ్యులతో ఎలా నడుచుకోవాలి? వారి మెప్పును ఎలా పొందాలి? వంటి అనేక ప్రశ్నలు బుర్రలో తిరుగుతుంటాయి. ఈ సంఘర్షణే తనను మరింత సంక్లిష్ట, సంకట స్థితిలోకి నెట్టేస్తుంది. ఎటూ నిర్ణయించుకోలేకపోతుంది, మనసంతా భయం భయంగా మారిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే ఉత్తమం?

నవ వధువులు అత్తగారి ఇంట్లో ప్రతి ఒక్కరినీ ఎలా సంబోధించాలి? లేదా ఆహ్వానించాలి? అనే విషయంలో తరచూ కలవరపడతారు. ‘బంధువులను వారి పేర్లతో పిలవాలా లేదా భర్తే వారిని పిలుస్తాడా?’ వంటి సందిగ్ధంలో ఉండిపోతారు. నిజానికి భారతీయ సమాజంలో ఒకరిని ఉత్తమంగా సంబోధించడాన్ని గౌరవానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదపూర్వకంగా పిలుస్తూనే, ఆత్మీయంగా అతిథి మర్యాదలు చేస్తే వారి అభిమానాన్ని పొందవచ్చు. అదే సమయంలో పుట్టినింట్లో ఉన్న సౌఖ్యం, సుఖం మెట్టినింట్లో ఉండదు. విశ్రాంతికే కాదు నచ్చిన సమయంలో భోజనం చేసేందుకు కూడా అత్తారింట్లో కుదరదని భావిస్తుంటారు. కానీ ఏ మనిషికైనా విశ్రాంతితో పాటు స్వేచ్ఛ తప్పనిసరి. అందువల్ల సమయం, సందర్భానుసారంగా అత్తారింట్లోనూ ఆ సౌకర్యాలు పొందొచ్చు.

ఇక నవ వధువు ఎదుర్కొనే సమస్యల్లో ‘హోమ్ సిక్‌నెస్’ ఒకటి. చిన్నప్పుడు చదువుల నిమిత్తం హాస్టల్‌కు వెళ్లేటప్పుడు ఎంతగా బాధపడ్డారో.. అక్కడికెళ్లాక ప్రారంభ రోజుల్లో ఇంటికి తిరిగొచ్చేందుకు ఎంత ఆరాటపడతారో.. ఇక్కడ కూడా అంతే. అయితే క్రమంగా హాస్టల్‌కు అలవాటుపడ్డట్టే.. అత్తారిల్లు కూడా కామన్ అయిపోతుంది. మనుషులు దగ్గరైన కొద్ది ఆ ఇల్లు కూడా మరో పుట్టిల్లులా మారిపోతుంది. కాలం రివ్వున తిరగ్గానే.. అప్పటివరకు అత్తారిల్లుగా చెప్పుకున్న ఆ ఇల్లాలు ‘మా ఇల్లు’ అనడం మొదలుపెడుతుంది. ఇక ప్రజెంట్ జనరేషన్‌లో స్నేహితులుగా, తల్లీకూతుళ్లుగా కలిసిపోతున్న అత్తాకోడళ్లను చూస్తూనే ఉన్నాం. అందుకే అత్తారిల్లు ఒక్కటే కాదు.. ఉద్యోగం మారినప్పుడు, మరో ఊరికి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, చివరకు డైలీ తినే హోటల్ చెఫ్ మారినా సరే.. కొత్తకు అలవాటు పడేందుకు టైమ్ పడుతుంది.

Advertisement

Next Story