కరుగుతున్న హిమానీనదాలు… ఆపడానికి ఇటలీ వింత ప్రయత్నం

by Harish |
కరుగుతున్న హిమానీనదాలు… ఆపడానికి ఇటలీ వింత ప్రయత్నం
X

గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఎండలు పెరిగి మంచుకొండలు, హిమానీనదాలు కరుగుతున్నాయి. ఇవి కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. చిన్న వర్షానికే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి తీవ్రనష్టం జరుగుతున్న ఈ రోజుల్లో.. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ద్వీపదేశాల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. అలాంటి దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అందుకే అక్కడి హిమానీనదాలు పెరిగిన ఎండల వల్ల కరిగిపోతుంటే మానవప్రయత్నంలో భాగంగా ఇటలీ తన పని తాను చేస్తూ పోతోంది. మొన్నటికి మొన్న కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇటలీ ఇప్పుడు కరుగుతున్న హిమానీ నదాల రూపంలో మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఇంతకీ ఇటలీ ఏం చేసిందంటే…

ఉత్తర ఇటలీలో ప్రెసెనా అనే హిమానీ నదం ఒకటి ఉంది. 1993 నుంచి ఈ హిమానీనదంలో మూడో వంతు కరిగిపోయింది. ఇక వేసవి కాలం కూడా రావడంతో కరగడం ప్రారంభమైంది. కాగా దీన్ని ఆపడానికి సూర్యరశ్మి ఆ హిమానీ నదం మీద పడకుండా చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో దాని మీద తెల్లని టార్పాలిన్ పొరలు కప్పారు. రోజురోజుకీ అది మరింత కరిగిపోతుండటంతో వీలైనంత మేరకు సూర్యుని కిరణాలు పడకుండా టార్పాలిన్‌తో కప్పినట్లు ఈ పనిని పర్యవేక్షిస్తున్న కారోసెల్లో టోనలో కంపెనీ ప్రతినిధి డేవిడే పనిజ్జా తెలిపారు. 2008 నుంచి తాము ఇలాగే చేస్తున్నామని అప్పట్లో 30,000 చదరపు మీటర్లు కప్పితే, ఇప్పుడు 1,00,000 చదరపు మీటర్లు కప్పాల్సివస్తోందని చెప్పారు. ఎంత ప్రయత్నించినా ఇది మానవ ప్రయత్నమేగానీ, పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదని డేవిడే అన్నారు. కానీ సెప్టెంబర్‌లో టార్పాలిన్‌లను తీసేసినపుడు ఎంతో కొంత హిమానీనదాన్ని కాపాడగలిగినందుకు వారికి గర్వంగా ఉంటుందని డేవిడే ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story