పచ్చబొట్టుగా వ్యాక్సిన్ బార్ కోడ్.. ఎందుకంటే ?

by Shyam |   ( Updated:2021-08-26 07:18:32.0  )
bar-code
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19 ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇతర దేశాల్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాలకు వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు చూపెట్టడం తప్పనిసరి. ఈ మేరకు వ్యాక్సినేషన్ ప్రూఫ్స్‌ను ప్రతీరోజు వెంట తీసుకెళ్లాలంటే కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఇబ్బందిని గమనించిన ఒక ఇటాలియన్ విద్యార్థి.. వ్యాక్సిన్ పాస్‌ను ఒంటిమీద టాటూ వేయించుకుని సమస్యకు సింపుల్‌గా చెక్ పెట్టాడు. తన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ బార్‌కోడ్‌ను చేతిపై వేయించుకున్నాడు.

ఇటలీలోని రెజియో కలాబ్రియాకు చెందిన ఆండ్రియా కలోనెట్టా.. రెండు డోసులకు సంబంధించిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ల బార్‌కోడ్‌ను చేతిపై టాటూ రూపంలో వేసుకున్నాడు. భిన్నంగా ఉండటానికి ఇష్టపడే ఆండ్రియా.. టాటూ ఆర్టిస్ట్ గాబ్రియేల్ పెల్లెరోన్‌తో తన బాడీ ఆర్ట్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వివిధ పరిమాణాల్లో అనేక బ్లాక్ బాక్స్‌లతో ఉండే క్లిష్టమైన టాటూ-క్యూఆర్ కోడ్‌ను రెండు గంటల కంటే తక్కువ సమయంలో రూపొందించినట్టు వెల్లడించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ల పట్ల చాలా అపోహలు ప్రజల్లో ఉందని, ‘యాంటీ-వ్యాక్సర్స్’కు అవగాహన కల్పించడంతో పాటు టీకా ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇది ఒక మార్గంగా భావిస్తున్నట్టు తెలిపాడు. ఇటలీలో ఈ నెల 6 నుంచి సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇండోర్ క్రీడా వేదికలకు వెళ్లేందుకు డిజిటల్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది.

ఏదైనా షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అయ్యేముందు టాటూ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ఎలా పనిచేస్తుందో కూడా ఆండ్రియా చూపించాడు. కాగా టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో దాదాపు మిలియన్ వ్యూస్ సంపాదించింది. అంతేకాదు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనూ వైరల్‌గా మారింది. ఈ క్యూఆర్ కోడ్ టాటూ ఆండ్రియాను ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మార్చేయగా.. నెటిజన్లను రెండుగా విభజించింది. అతని టాటూ ‘రెచ్చగొట్టేది’ అంటూ పలువురు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విమర్శించగా, మరికొందరు ‘పబ్లిసిటీ స్టంట్’గా వర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed