యశోదా ఆసుపత్రిలో ఐటీ సోదాలు

by Sumithra |
యశోదా ఆసుపత్రిలో ఐటీ సోదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు 18 మంది ఐదు బృందాలుగా విడిపోయి ఏక కాలంలో మంగళవారం ఉదయం సోదాలు మొదలుపెట్టారు. మరో రెండు రోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోమాజీగూడ యశోదా ఆసుపత్రితో పాటు సికింద్రాబాద్, మలక్‌పేట్ బ్రాంచీల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రెండు బృందాలు సోమాజీగూడ బ్రాంచికి అనుబంధంగా ఉన్న క్యాన్సర్ బ్లాకులో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలను దృష్టిలో పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగాల్లో పనిచేస్తున్నసిబ్బందిని మూడు రోజుల పాటు విధులకు రావద్దంటూ యాజమాన్యం ఆదేశించింది.

ఆదాయపు పన్ను రిటన్‌లలో వచ్చిన తేడాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాల్లోని వివరాలను కూడా ఈ సోదాల సందర్భంగా వెరిఫై చేస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆడిట్ చేయని లెక్కలను కూడా కంప్యూటర్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్ విభాగాలను ఐటీ అధికారులు పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ ఈ సోదాల గురించి ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

యశోద ఆసుపత్రి పరిపాలనా కార్యాలయంగా ఉన్న నాగార్జున హిల్స్ దగ్గరి ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఒక బృందం సోమాజీగూడ ఆసుపత్రి, మరో బృందం దానికి అనుబంధంగా ఉన్న క్యాన్సర్ బ్లాక్, మరో బృందం మలక్‌పేట, ఇంకొక బృందం సికింద్రాబాద్ బ్రాంచీ, ఐదవ బృందం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో సోదాలు చేస్తున్నట్లు ఐటీ వర్గాల సమాచారం. సోదాలు మొత్తం పూర్తయిన తర్వాతనే ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed