ISRPG కరోనా సర్వే – TS ప్రభుత్వానికి సూచనలు 

by Shyam |
ISRPG కరోనా సర్వే – TS ప్రభుత్వానికి సూచనలు 
X

ఇండిపెండెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పీపుల్స్ గ్రూప్ సిద్దిపేట పట్టణ ప్రజలతో ఆన్ లైన్ సర్వే నిర్వహించి కరోనాపై కూలంకషంగా అధ్యయనం చేసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

1. కోవిడ్-19 చాలా భయంకరమైనదే, కాని చాలా కేసులలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. అలాంటి వారిని ఆస్పత్రులపై భారం పెంచకుండా ఇంట్లోనే ఉంచి వారికి కావలసిన మెడిసిన్స్, ఆక్సీమీటర్ వంటి చికిత్స సామాగ్రిని ఆశా వర్కర్స్ లేదా వాలంటీర్ల ద్వారా అందించాలి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయినా, శ్వాస సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు త్వరగా ఆస్పత్రిలో చేర్చాలి. టెలి మెడిసిన్ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి.

2. తెలంగాణ కోవిడ్-19 మొబైల్ యాప్ ని ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న కోవిడ్-19 ఆస్పత్రులు, అందులో అందుబాటులో ఉన్న బెడ్స్, వెంటిలేటర్లు సంఖ్య మరియు పరీక్ష కేంద్రాల యొక్క తాజా సమాచారాన్ని పొందుపరచాలి.

3. వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పరీక్ష కేంద్రాలకు వస్తే మార్గ మధ్యలో వాళ్ళ ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంది. కావున వారికి ఇంటి నుండే పరీక్షలు నిర్వహించేలా కోవిడ్-19 పరీక్ష వాహనాలను ఏర్పాటు చేయండి.

4. కోవిడ్-19 కాకుండా ఇతర వ్యాధులకి సంబంధించి ఆస్పత్రులను కోవిడ్-19 ఆస్పత్రులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నాన్-కోవిడ్-19 ఆస్పత్రుల సమాచారాన్ని కూడా మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంచాలి.

5. రోగి పరిస్థితి విషమిస్తే ప్లాస్మా థెరపీని వైద్యులు సూచిస్తున్నారు. కావున వ్యాధి నుండి కోలుకున్న వారి యొక్క సమాచారాన్ని చాలా పకడ్బందీగా సేకరించి అవసరమున్న వారికి ప్లాస్మా అందేలా చూడాలి.

6. కోవిడ్-19 చికిత్స సామాగ్రితో చీకటి వ్యాపారం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స సామాగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలి.

7. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టిక ఆహార వస్తువులను ఇంటికే అందించాలి.

8. రాష్ట్ర సరిహద్దు వద్దనే కోవిడ్-19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి వ్యక్తికి పరీక్షలు చేసి ఆ వ్యక్తిని ట్రాకింగ్ చేయాలి.

9. ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.

10. ఇప్పటికే కోవిడ్-19 ని విపత్తుగా గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు చట్టాన్ని ఉపయోగించి ప్రజలందరిని ఆదుకోవాలి.

11. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వైద్యం కోసం ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

12. ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రాధాన్యత తగ్గించి, ఆ నిధులన్నింటిని ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలి.

13. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో ఉన్న కారణంగా స్థానిక మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేట్ సంస్థలు ఇలా కొన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు తమ పార్టీ ఫండ్ నిధులను తమ నియోజకవర్గాల ప్రజా ఆరోగ్య వ్యవస్థలకు కేటాయించాలి. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులకి అన్ని సౌకర్యాలను అందించాలి.

14. వైద్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలి. ఇది ఒక విపత్తుగా కొనసాగుతున్న కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులను పని లేక, ఉన్న చోటు నుండి కదలలేక పోతున్న ఈ సమయంలో విశృంఖలంగా జరుగుతున్న వైద్యం పేరిట దోపిడిని ప్రభుత్వాలు కఠినంగా నియంత్రించాలి. తక్షణమే ప్రైవేట్ వైద్యం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి అందరికి సరైన కోవిడ్-19 వైద్యం అందాలి.

15. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లంటూ చేస్తున్న విధానాలను ఒక్క సారీ పరిశీలించాలి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడున్న ఆర్థిక,ఆరోగ్య సంక్షోభాలను పరిగణలోకి తీసుకోవాలి.

16. యాచకులను, ఇల్లు లేని వాళ్లను, ఏ తోడు నీడ లేని వాళ్లను, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఇలా అన్ని ఆశ్రమాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి.

17. ఉన్నత చదువులు చదువుకుంటున్నవారు, వివిధ రకాలుగా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోని చదువుకుంటున్నవారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారు అయింది. ప్రభుత్వం ఈ సంక్షోభ కాలంలో వారిని ఆదుకోవడానికి కరోనా భత్యం లాగా ₹. 5000 నెల వారీగా అందించాలి.

18. ప్రైవేట్ సెక్టార్ లో పని చేస్తున్న సిబ్బందిని ఆయా సంస్థలే ఆదుకునే లాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

19. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రభుత్వమే ఆదుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed