అద్భుత చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

by Shamantha N |
అద్భుత చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
X

న్యూఢిల్లీ: భారత్ పంపిన మంగళ్‌యాన్ ఆర్బిటార్ అరుదైన చిత్రాలను తీసి పంపించింది. మార్స్(అంగారకుడు)కు సమీపంలోని అతిపెద్ద చంద్రుడు ఫొబోస్ చిత్రాలను పంపగా వాటిని ఇస్రో తాజాగా విడుదల చేసింది. అంగారకుడికి సుమారు 7,200 కిలోమీటర్లు, ఫొబోస్‌కు దాదాపు 4,200 కిలోమీటర్ల దూరంలో ఉండగా మామ్(మార్స్ ఆర్బిటార్ మిషన్) ఈ మార్స్ కలర్ క్యామెరా(ఎంసీసీ)ద్వారా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించింది.

ఈ చిత్రంలో ఫొబోస్‌పైనున్న అతిపెద్ద అగాధం స్టిక్నీ సహా ష్క్లో‌వ్స్కీ, రోచ్, గ్రిల్‌డ్రిగ్‌లాంటి అతిపెద్ద లోయలను గుర్తించవచ్చు. భూమి చుట్టు తిరిగే చంద్రుడిలాగే, అంగారకుడికి రెండు చందమామలున్నాయి. అందులో మార్స్‌కు దగ్గరగా ఉండే పెద్ద చందమామ ఫొబోస్‌తో పాటు దూరంలో ఉండే డెయిమోస్ ఉన్నాయి. తాజాగా, మామ్ ఫొబోస్ చిత్రాలను తీసింది. 2013 నవంబర్ 5న ఇస్రో మామ్‌ను పీఎస్‌ఎల్వీ రాకెట్‌లో పంపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న భూ గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకున్న ఈ ఆర్బిటార్ 2014 సెప్టెంబర్ 24న విజయవంతంగా మార్స్ కక్ష్యలోకి చేరింది. కేవలం ఆరునెలలు మాత్రమే ఈ ఆర్బిటర్ పనిచేయనుందని చెప్పినా.. సరిపడా ఇంధనం ఉండటంతో ఏళ్లుగా ఈ రెడ్ ప్లానెట్ చుట్టూ తిరగనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Next Story