ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఐసొలేషన్ బెడ్స్

by Shyam |
ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఐసొలేషన్ బెడ్స్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 25 చొప్పున బెడ్‌లను కరోనా అనుమానిత పేషెంట్ల అవసరాల కోసం ఐసొలేషన్ వార్డులుగా కేటాయించాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులూ ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఐదు బెడ్‌లను ఐసీయూ వార్డుల్లో, మిగిలిన 20 బెడ్‌లను ఐసోలేషన్ అవసరాల కోసం రిజర్వు చేసి ఉంచాలని ట్రస్ట్ సీఈఓ శాంతికుమారి ఒక సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌ను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులన్నింటికీ పంపారు. కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందించే ఉద్దేశంతో ఈ బెడ్‌లను రిజర్వు చేసి ఉంచాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు.

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆపరేషన్ల కోసం తేదీలను నిర్ణయించిన కేసులను మరో తేదీకి వాయిదా వేయాలని శాంతికుమారి తన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అత్యవసర కేసులను మాత్రం యధావిధిగా ప్రాధాన్యతను బట్టి చూడవచ్చునని పేర్కొన్నారు. అయితే నిర్ణీత సర్జరీలను ఎన్ని రోజులకు వాయిదా వేయాలనేదానిపై మాత్రం ఆ సర్క్యులర్‌లో ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటిదాకా సుమారు వెయ్యికి పైగా బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అవి కాకుండా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న దాదాపు 300కు పైగా ఆసుపత్రుల్లో తలా 25 చొప్పున సుమారు పదివేల బెడ్‌లను అదనంగా ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.

నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. ఐసోలేషన్ వార్డుల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిబ్బందికి నిపుణత, అనుభవం లేదన్న విషయాన్ని ఆ సంఘం నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినప్పుడు మిగిలిన వార్డుల్లోనే పేషెంట్లకు సేవలందించడంలో ఉన్న ఇబ్బందులను, ఆ పేషెంట్లలో ఉండే మానసిక ఆందోళనను సైతం గుర్తుచేశారు. క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులను వేర్వేరుగా నిర్వహించడం శాస్త్రీయంగా ఉత్తమమన్న అభిప్రాయంతో ఉన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను ఇందుకోసం ఎంపిక చేయడం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు నెట్‌వర్క్ ఆసుపత్రులు సానుకూలంగా ఉన్నాయి.

tags : Telangana, Corona, AarogyaSri Network, Hospitals

Advertisement

Next Story

Most Viewed