- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరి ఐల్యాండ్ జంట కథ!
దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌కు పక్కనే ఉన్న గ్రేట్ బ్లాస్కెట్ ఐల్యాండ్‌లో ఒంటరిగా నివసిస్తూ, ఇక్కడి హోటల్ పనులు చూసుకోవడానికి ఒక జంట కావలెను అని జనవరిలో యాలీస్ హేయిస్, బిల్లీ ఒకానర్‌లు ట్విట్టర్‌లో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వార్తాపత్రికలు, మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి ఈ ఉద్యోగం కోసం యాభై వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. నగర జీవితంతో విసిగివేసారి, ఎక్కడైనా ఒంటరిగా ఉందామని నిర్ణయించుకున్న ‘ఆనీ బిర్నే, ఇయోన్ బోయిల్’ జంట కూడా దీనికి దరఖాస్తు చేసుకున్నారు. తమ గురించి ఈమెయిల్ ద్వారానో, మెసేజ్ ద్వారానో కాకుండా ఒక కాగితం మీద లేఖ రాసి పంపించారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈమెయిళ్లను, మెసేజ్‌లను కాదని ఈ కాగితపు లేఖకు యాలీస్, బిల్లీల జంట ప్రాధాన్యతనివ్వడం. అంతే అర్థమైంది కదా.. ఆ ఐల్యాండ్‌లో నివసించడానికి బిర్నే, ఇయోన్‌లు ఎంపికయ్యారు.
మార్చిలో అన్ని సర్దుకుని వచ్చి ఐల్యాండ్‌లో ఉండాలని యాలీస్, బిల్లీ జంట, బిర్నే, ఇయోన్ జంటకు చెప్పారు. దీంతో వారు చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి.. ఇల్లు, ఆస్తులు అమ్మేసి, కావాల్సినవన్నీ సర్దుకుని సిద్ధమయ్యారు. వారుండే ప్రదేశం నుంచి డబ్లిన్ చేరుకున్నారు. అక్కడ రెండ్రోజులు ఉండి, కావాల్సినవి కొనుక్కొని బ్లాస్కెట్ ఐల్యాండ్‌కు వెళ్దామనుకున్నారు. కానీ అనుకోని సంఘటన జరిగింది. కరోనా కారణంగా ఐర్లాండ్ మొత్తం లాక్‌డౌన్ విధించారు. దీంతో బిర్నే, ఇయోన్‌లు డబ్లిన్‌లో ఇరుక్కుపోయారు. వాళ్లు పెట్టుకున్న ఆశలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. లాక్‌డౌన్ ఒక రెండ్రోజులు ఉంటుందేమో అనుకుంటే రెండు నెలలు సాగింది. చివరాఖరకు జూన్ నెలలో ఐర్లాండ్ ప్రభుత్వం ప్రయాణాల మీద సడలింపులు తీసుకొచ్చారు. అప్పటికి కానీ ఈ జంటకు ఐల్యాండ్‌లో అడుగుపెట్టే అవకాశం రాలేదు. ఎట్టకేలకు ఆ ఐల్యాండ్‌లో అడుగుపెట్టాక మరో సమస్య మొదలైంది.
గ్రేట్ బ్లాస్కెట్ ఐల్యాండ్‌లో వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. సముద్రం మీది నుంచి అత్యధిక వేగంతో వీచే గాలులు, ఎత్తుపల్లాలతో ఉండే భూభాగాలకు తోడుగా అక్కడ విద్యుత్‌తో పాటు వైఫై కూడా ఉండదు. అక్కడ ఉండేవి ఒక కాఫీ హోటల్, మూడు గదులు, వేరొక రెస్టారెంట్ మాత్రమే. రెస్టారెంట్‌లో నివసిస్తూ అక్కడికి వచ్చిన అతిథులకు కావాల్సినవి సమకూరుస్తూ, మూడు గదులను పర్యవేక్షించడమే బిర్నే, ఇయోన్‌లు చేయాల్సిన పని. ఇంత ప్రత్యేకమైన ఐల్యాండ్ కాబట్టే సంవత్సరంలో దాదాపు 300 నుంచి 350 రోజులు పర్యాటకులు వస్తూనే ఉంటారు కాబట్టి అక్కడ నివసించే వారికి ఒంటరిగా ఉంటున్నామనే బెంగ ఉండదు. కానీ బిర్నే, ఇయోన్‌లు దురదృష్టమో లేక అదృష్టమో తెలియదు కానీ వారు అనుకున్నట్లుగా ఐల్యాండ్‌లో ఆనందంగా జీవించగలుగుతున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఒక్క పర్యాటకుడు కూడా రాలేదు. కారణం కరోనా.
ప్రయాణాలకు అనుమతినిచ్చిప్పటికీ ఐర్లాండ్ ప్రభుత్వం పర్యాటకానికి ఇంకా సడలింపులు ఇవ్వలేదు. దీంతో ఈ ఐల్యాండ్‌ను సందర్శించడానికి ఎవరూ రావడం లేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. జనవరిలో ఐల్యాండ్ ఉద్యోగం గురించి ప్రకటన చేసినపుడే దీని గురించి చాలా మందికి తెలిసింది. ఆ ఉద్యోగం కోసం కాకపోయినా అక్కడ ఒక రెండ్రోజులు ఉండాలని ప్లాన్ చేసుకున్న వాళ్లందరూ అప్పుడే బుకింగ్‌లు చేసుకున్నారు. 2020 డిసెంబర్ వరకు అక్కడి హోటల్ గదులు బుక్ అయిపోయాయి. కానీ కరోనా కారణంగా ఇప్పుడు వారికి పర్యటించే అవకాశం లేదు. దీంతో చేసేదిలేక.. బిర్నే, ఇయోన్‌లు మాత్రమే అక్కడ ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నారు. పొద్దున్నే లేవడం, కాఫీ పెట్టుకుని సముద్రపు అలలు చూస్తూ తాగుతుంటే వచ్చే ఫీలింగ్ అమోఘమని వారు అంటున్నారు. ఎవరూ లేకుండా ప్రకృతితో కలిసి జీవిస్తున్నందుకు ఒకింత ఆనందంగానే ఉన్నా, న్యూ ఇయర్, క్రిస్మస్ లాంటి వేడుకలు ఒంటరిగా జరుపుకోవాల్సి వస్తుందనే బెంగ మాత్రం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈ ఐల్యాండ్‌లో ప్రశాంతంగా జీవించాలని తమకు రాసిపెట్టి ఉంది కాబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలిగామని ఆ జంట సంతోషంగా చెప్పారు. చూడబోతే కరోనా కారణంగా ఇబ్బంది పడని వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎవరూ లేరనిపిస్తోంది.