ఈసారి నైటింగేల్ అవార్డు లేనట్లేనా?

by Shyam |
ఈసారి నైటింగేల్ అవార్డు లేనట్లేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ సంవత్సరం నర్సుల సేవలను గుర్తించి ప్రకటించే ‘నైటింగేల్‘ అవార్డుల జాబితాలో ఈసారి తెలంగాణకు చోటు దక్కడం అనుమానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య విద్య డైరెక్టర్, నర్సింగ్ డైరెక్టరేట్ రిజిస్ట్రార్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పలువురితో సెలక్షన్ కమిటీ ఏర్పాటై నలుగురి పేర్లను జాతీయ నర్సింగ్ కౌన్సిల్‌కు మార్చి నెలలో సిఫారసు చేసింది. ఈ నలుగురిలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక నర్సు కూడా ఉన్నారు. నర్సింగ్ కౌన్సిల్ విధించిన గడువు లోపలే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెలక్షన్ కమిటీ ఈ జాబితాను సమర్పించింది. అయితే నిర్దిష్ట పద్ధతిలో సెలక్షన్ కమిటీ సిఫారసులు లేవన్న కారణాన్ని చూపిన జాతీయ నర్సింగ్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించింది.

అయితే ఈ విషయంపై సెలక్షన్ కమిటీకి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం నర్సింగ్ కౌన్సిల్ నుంచి రాలేదు. కానీ సెలక్షన్ కమిటీ ప్రతిపాదించిన నలుగురు నర్సులకు మాత్రం కౌన్సిల్ నుంచి విడివిడి మెయిల్‌ల ద్వారా సమాచారం వచ్చింది. సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరిస్తున్నట్లు కౌన్సిల్ తరఫున జాయింట్ డైరెక్టర్ భారతి ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీ దృష్టికి ఒకరిద్దరు నర్సులు తీసుకెళ్ళారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వైద్య విద్య డైరెక్టర్ ఉన్నారు. కానీ ఆయన కరోనా కారణంగా ఐసొలేషన్‌లో ఉండడంతో జాతీయ నర్సింగ్ కౌన్సిల్‌కు లేఖ రాసి తగిన కారణాలను తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోంది.

నర్సింగ్ రంగంలో ‘నైటింగేల్‘ అవార్డు ప్రతిష్ఠాత్మకమైనందున కరోనా కష్టకాలంలో ఎంతో సేవ చేసిన నర్సులు ఉన్నప్పటికీ, నలుగురి జాబితాను పంపినప్పటికీ తిరస్కారం రావడాన్ని నర్సులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నైటింగేల్‘ అవార్డు వ్యక్తులకు ఇచ్చేదే అయినా ఈసారి తెలంగాణ తరఫున ఎవ్వరికీ రాకపోవడమంటే అది రాష్ట్రానికే అవమానంగా ఉంటుందన్న అభిప్రాయం నర్సుల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెలక్షన్ కమిటీ సంప్రదింపుల ద్వారానే ఈ గందరగోళాన్ని తొలగించవచ్చని నర్సులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed