కరోనా మరణాలకు, కాలుతున్న శవాలకు ఇంత తేడానా

by Shamantha N |
కరోనా మరణాలకు, కాలుతున్న శవాలకు ఇంత తేడానా
X

భోపాల్ : కరోనా బారిన పడి దేశంలో మరణాల సంఖ్య కూడా నానాటికీ ఎక్కువవుతున్నది. అయితే పలు రాష్ట్రాలు కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్యను కూడా దాస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా బులిటెన్‌లో వెలువరించిన మరణాలకు, శ్మశానాలలో కాలుతున్న శవాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలూ అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత శ్మశానాల వద్ద అంతటి రద్దీని చూస్తున్నామని పలువురు చెబుతుండగా.. మధ్యాహ్నం పూట లంచ్ చేయడానికి కూడా సమయం దొరకడం లేదని శ్మశానాలలో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. ఇక కాట్నాల గడ్డ ఎదుట అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారో అని మృతుల బంధువులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తుండటం గమనార్హం.

గడిచిన ఐదు రోజులుగా గణాంకాలను పరిశీలిస్తే…

ఈ నెల 8న భోపాల్ శ్మశానవాటికలో 41 శవాలను దహనం చేయగా రాష్ట్ర కరోనా బులిటెన్ లో మాత్రం రాష్ట్రవ్యా్ప్తంగా 27 మంది మరణించారని పేర్కొన్నారు. 9న 35 శవాలకు అంత్యక్రియలు చేయగా.. బులిటెన్ లో 23 మరణాలే ఉన్నాయి. ఇక ఏప్రిల్ 10న 56 మందికి అంత్యక్రియలు నిర్వహించగా.. అధికారిక మరణాలు 24 గానే చూపించారు. తర్వాతి రోజున 68 మందిని కాల్చివేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 24 మందే మరణించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక 12 వ తారీఖున ఒక్క భోపాల్ లోనే 37 బాడీలను తగులబెట్టగా.. రాష్ట్రం మొత్తమ్మీద 37 మంది చనిపోయారని బులిటెన్ లో పేర్కొన్నారు.

పై గణాంకాలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా మరణాలను దాస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. కానీ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. మరణాల సంఖ్యను దాచడానికి తమకు అవసరం లేదని, అలా చేయడం వల్ల తమకేమీ అవార్డులు రావని ఆయన ఎదురుదాడికి దిగారు.

ఇదిలాఉండగా.. శ్మశానంలో పని చేస్తున్న సిబ్బంది చెబుతున్నదాన్ని బట్టి చూసినా రాష్ట్ర ప్రభుత్వం మరణాలను దాస్తు్న్నదనే విషయం స్పష్టమవుతున్నది. భోపాల్ లోని ఓ శ్మశానవాటికలో పనిచేస్తున్న రాయిస్ ఖాన్ మాట్లాడుతూ.. ‘శవాలను దహనం చేయడానికి రోజుకు 100-150 క్వింటాళ్ల కట్టెలు అవసరమవుతున్నాయి. గత వారం కట్టెలు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాం. శ్మశానాల ఎదుట పదుల సంఖ్యలో మృతదేహాలు అంత్యక్రియల కోసం నిలిచి ఉంటున్నాయి’ అని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed