రాజధానుల ‘ఉపసంహరణ’ జగన్ వ్యూహమేనా..?

by Anukaran |
CM Jagan Amaravathi
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అమలు కావాల్సిందే. పూర్తయ్యే వరకు ఆయన పట్టు వీడరు. అటువంటి వ్యక్తి మూడు రాజధానులపై వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. అసెంబ్లీలో ప్రకటన చూసిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నిర్ణయం రాజకీయ ఎత్తుగడేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం.. మరోవైపు కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు.. ఇంకోవైపు మహాపాదయాత్రకు పెరుగుతున్న మద్దతు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

న్యాయచిక్కులే కారణమా?

మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోంటుంది. గతంలో అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ హైకోర్టును, సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే రెండు న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెల్లడైంది. తాజాగా హైకోర్టులో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు విచారణలో ఉన్నాయి. 57 పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. వీటిపై ధర్మాసనం రోజు వారీ విచారణ చేపట్టింది. అయితే ఈ ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులపై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి బొక్క బోర్లాపడింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి అందరి రాజధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు భూములు ఇచ్చిన రైతులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చింది. రాజధానిపై పిటిషన్లను విచారించలేకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడిందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. త్వరలోనే తీర్పు వెల్లడిస్తామంటూ ప్రకటన కూడా చేసింది. త్వరలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ .. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఎన్నికల ప్రచార అస్త్రం ఇదేనా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల అంశాన్నే ప్రచార అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో వైసీపీకి పట్టుంది. విశాఖను రాజధానిగా చేస్తే.. ఉభయగోదావరితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి మరింత మైలేజ్ వస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఆరునెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి.. బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

రాజధాని బిల్లు ఉపసంహరణ జగన్నాటకమే : చంద్రబాబు

Next Story

Most Viewed