తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌‌కు పదవీ గండం.?

by Anukaran |   ( Updated:2020-12-04 00:50:59.0  )
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌‌కు పదవీ గండం.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పదవికి గండం పొంచి ఉందా? సీఎస్ పనితీరు మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆయనను మార్చే అవకాశముందంటూ ఉద్యోగ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. సీనియర్లను కూడా కాదనుకుని సోమేశ్‌కుమార్ కు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఆశించిన మేరకు పని చేయలేకపోయారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఎల్ఆర్ఎస్, ధరణి లాంటి అంశాలలో సీఎస్ చేసిన ప్రతిపాదనలు వికటించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చాయని అసహనంగా ఉన్నారని తెలిసింది. సోమేశ్ కుమార్ రెవెన్యూ, ఎక్సయిజ్, వాణిజ్య పన్నుల శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. ఆ అనుభవం, సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంలో దోహదపడతారనే నమ్మకంతో సీఎస్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. సీఎస్‌గానే కాకుండా చాలా శాఖలకు ఆయనే కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు.

వికటించిన ప్రతిపాదనలు..

ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చని, ధరణి ద్వారా దేశంలోనే ఆదర్శనీయంగా ఉండే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టవచ్చని సీఎస్ కల్పించిన విశ్వాసంతో సీఎం ముందడుగు వేశారు. ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత విపక్షాల నుంచే కాక, ప్రజల నుంచి కూడా ఊహించని వ్యతిరేకత వచ్చింది. ప్రతిష్ఠాత్మకం అని భావించిన ధరణి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటికీ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎల్ఆర్ఎస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ప్రత్యేకంగా కొత్త చట్టాలను చేసినా సంతృప్తికర ఫలితాలు రాలేదన్న అసంతృప్తి సీఎంలో కలిగినట్లు సమాచారం. ఈ విషయం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వరకూ చేరింది. దీంతో వారు తదుపరి సీఎస్ ఎవరవుతారో కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి నిజంగా అసంతృప్తి కలిగిందా, అది ఏ స్థాయిలో ఉంది లాంటి చర్చలు వారి మధ్య సాగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 20 వేల కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని సీఎంకు ప్రతిపాదించారు. ప్రజల కొనుగోలు శక్తి, తలసరి ఆదాయం సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ భారాన్ని భరించడం పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కానీ, కరోనా సమయంలో ఆదాయం తగ్గిపోయి, ఖర్చులను బ్యాలెన్సు చేసుకుంటూ పొదుపు మంత్రం పాటిస్తున్న సమయంలో ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం ప్రజల అసహనానికి కారణమైంది. చివరకు అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. సీఎస్ మదిలోంచి పుట్టిన ఈ ఆలోచన ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల కూడా వ్యతిరేకతకు కారణమైందని ఉద్యోగుల అభిప్రాయం.

మూడు నెలలు శ్రమించినా..

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కామన్ ఫ్లాట్‌ఫాంగా ‘ధరణి’ని రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ టాస్కును సీఎస్ చేపట్టారు. వెబ్‌సైట్ రూపకల్పన మొదలు ట్రయల్ రన్ వరకు సవాలుగా తీసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయం వచ్చినా వెనక్కు తగ్గలేదు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు తగ్గపోయిన పరిస్థితులలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. ప్రజలు కూడా వివిధ అవసరాల కోసం ఆస్తుల్ని అమ్ముకోవడం, భూమిని వదులుకోవాల్సి రావడం లాంటి పనులకు కూడా బ్రేక్ పడింది. స్టాంపు డ్యూటీ, నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు, రవాణా ఆదాయం, పెట్రోలు-డీజిల్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం.. ఇలా వివిధ సెక్షన్ల ప్రజల జీవనోపాధి మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. డబ్బు చెలామణికి కూడా ఆటంకం కలగడంతో ఆదాయ వనరులను కూడా ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. ఈ అంశాలన్నింటి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన ఎల్ఆర్ఎస్, ధరణి ప్రాజెక్టులు ఫెయిల్యూర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక కోర్టుల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడం లాంటివి కూడా తోడైనట్లు తెలిసింది. ఈ అసంతృప్తి ప్రగతిభవన్ గేటు దాటి బయటకు ఎలా వచ్చిందోగానీ ఉద్యోగ సంఘాలలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story