జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ఖాయం?

by srinivas |
జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ఖాయం?
X

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజన అనంతరం ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి మారబోతున్నారని, అదే సమయంలో రాజ్యసభకు ఆయన ఆ పార్టీ తరపున బరిలో దిగబోతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజా నామినేషన్లతో ఆయన వైఎస్సార్సీపీలో చేరేది లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై చిరంజీవి ఒక వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే తన మద్దతని చిరంజీవి స్పష్టం చేశారు. తానొక పార్టీలో, తమ్ముడు మరొక పార్టీలో ఉంటే… తమను గుండెల్లో పెట్టుకుని ఆరాధించే అభిమానులు అయోమయానికి గురవుతారన్న చిరంజీవి, అలాంటి పరిస్థితి తలెత్తకూడదని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి తనకు పూర్తిగా తెలుసని, చాలా పట్టుదల ఉన్న వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కాకపోయినా… రేపటి రోజైనా తాను అనుకున్నది సాధిస్తాడని ఆయన చెప్పారు. ఒక అన్నగా పవన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. తానే కాదని, తమ కుటుంబం మొత్తం పవన్ వెంటే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే జనసేనకు మద్దతు పలుకుతున్నానని తెలిపారు.

తమ దారులు వేరైనా… గమ్యం మాత్రం ఒకటేనని చిరంజీవి వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం పవన్‌కి ఉందన్న ఆయన, అతనికి రాజకీయ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అప్పట్లో పార్టీలో జరిగిన పరిణామాలను పవన్ దగ్గరుండి చూశాడని, చేరదీసిన వాళ్లు తనను దెబ్బతీశారనే భావన పవన్ లో ఉందని, తనకు తగిలిన ఎదురు దెబ్బల నుంచి పవన్ గుణపాఠం నేర్చుకున్నాడని ఆయన వెల్లడించారు. మరోసారి అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాము కలుసుకున్నప్పుడు తమ మధ్య రాజకీయపరమైన చర్చలు రావని స్పష్టం చేశారు.

చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో హర్షాన్ని రేకెత్తిస్తున్నాయి. పవన్, చిరంజీవి కలిస్తే తమ పార్టీకి తిరుగులేదని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెగా ఫ్యామిలీ నుంచి సుమారు ఆరేడుగురు సినీ హీరోలున్నారు. వీరందరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్, చిరు కలిస్తే వారంతా పవన్ వెంటే ఉంటారని, ఇది వారికి రాజకీయంగా కలసివస్తుందని వారు అంచనావేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

Tags: chiranjeevi, tollywood, actor, janasena, pawan kalyan

Advertisement

Next Story

Most Viewed