తాప్సి ఇంట్లో ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం?

by Anukaran |   ( Updated:2021-03-04 00:59:41.0  )
తాప్సి ఇంట్లో ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం?
X

దిశ వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ తాప్సి, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లల్లో ఐటీ దాడులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. నిన్న తాప్సి, అనురాగ్ కశ్యప్ ఇళ్లతో పాటు వారితో సంబంధమున్న నిర్మాత వికాస్ బల్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పాంటమ్ ఫిలిమ్స్ ఆఫీసులో అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఏం ఏం స్వాధీనం చేసుకున్నారనే విషయం ఇంకా బయటపడలేదు.

అలాగే నిర్మాత మధు మంతెన ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది. హిందీతో పాటు తెలుగు, బంగ్లా భాషల్లో ఆయన అనేక సినిమాలను నిర్మించారు. 2008లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన గజనీ సినిమాను నిర్మించగా.. ఆ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఇక మహారాష్ట్ర, పుణెలో తాప్సి, అనురాగ్ కశ్యప్, మధు మంతెనలకు సంబంధించిన ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

అయితే తాప్సి, అనురాగ్ కశ్యప్‌ల ఇళ్లల్లో ఐటీ దాడుల వెనుక బీజేపీ ప్లాన్ ఉందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం వారిద్దరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడమేనట. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యమానికి పలవురు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో రైతుల ఉద్యమానికి తాప్సి, అనురాగ్ కశ్యప్ మద్దతు ప్రకటిస్తూ ట్విట్టర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా గత ఏడాది ఫిబ్రవరిలో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో అనురాగ్ కశ్యప్ స్వయంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గళం విప్పినందుకే తాప్సి, అనురాగ్ కశ్యప్‌లపై ఐటీ దాడులు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story