‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి ఇరిగేషన్ అధికారులు

by Shyam |
Taxi stand‌
X

దిశ, ఆర్మూర్: ‘టాక్సీ స్టాండ్‌పై కౌన్సిలర్ కన్ను’ అనే శీర్షికతో ‘దిశ’ దిన పత్రికలో శనివారం ప్రచురించిన ప్రత్యేక కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోకాలను వెంటనే తొలగించాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సంబంధిత కౌన్సిలర్‌ను, మరో కౌన్సిలర్ భర్తను ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ కట్ట ప్రాంతంలోని నీటి పారుదల శాఖ స్థలంలో కోకాలు ఏర్పాటు చేసి కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ల ఆటలు సాగలేదు. పట్టణం నడిబొడ్డున కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఆ స్థలాన్ని టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేసన్ వారు సంబంధిత శాఖాధికారుల అనుమతితో వినియోగించుకుంటున్నారు.

టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా కోకాలు వెలిశాయి. పట్టణంలోని 18వ వార్డు కౌన్సిలర్ వనం శేఖర్, 30వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్య భర్త శివ ఇరిగేషన్ స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. పథకం ప్రకారం టాక్సీ స్టాండ్ స్థలంలో తమ అనుచరులతో కోకాలు ఏర్పాటు చేయించారని ప్రచారం జరిగింది. ఇదే విషయమై ‘దిశ’ వార్త ప్రచురించడం, మరోవైపు టాక్సీవాలాలు కబ్జాదారులను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది.

దీంతో విషయం ఇరిగేషన్ అధికారుల వరకూ వెళ్లింది. స్పందించిన ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. ఇరిగేషన్ ఏఈ సదరు కౌన్సిలర్‌ను, మరో కౌన్సిలర్ భర్తను పిలిపించి మాట్లాడారు. ఇరిగేషన్ స్థలంలో నంచి కోకాలను తొలగిస్తామని ఒప్పుకున్నారని డీఈ మీడియాతో తెలిపారు. మరోవైపు టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు శనివారం ధర్నా చేపట్టారు. కోకాలను తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed