ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం.. రామ‌ప్ప చెరువుకు ముప్పు..!

by Shyam |   ( Updated:2021-09-29 23:42:45.0  )
Ramappa cheruvu
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ /రామ‌ప్ప: చారిత్రాత్మక రామ‌ప్ప చెరువుకు గండి ప‌డే ముప్పు పొంచి ఉందా..? మ‌త్తడి వెడ‌ల్పుకు శాశ్వత నిర్మాణాలు చేప‌ట్టక‌పోవ‌డంతో ప్రమాద‌ం పొంచి ఉందా..? వ‌ర‌ద‌లు వచ్చిన‌ప్పుడే తూతూ మంత్రంగా చేప‌డుతున్న మ‌త్తడి వెడ‌ల్పు ప‌నుల‌తో ఉప‌యోగం లేక‌పోగా ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టనున్నాయా..? అంటే అవున‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కాక‌తీయ రాజుల గొలుసు క‌ట్టు చెరువుల నిర్మాణాల్లో భాగంగానే రామ‌ప్ప చెరువు అవ‌త‌రించింది. వంద‌ల సంవ‌త్సరాలుగా ఈప్రాంత రైతుల‌కు చెలిమిలా మారింది. 2.8 టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న చెరువు కింద వేలాది ఎక‌రాల వ్యవసాయ భూమి సాగు అవుతోంది. ప‌ర్యాట‌కంగాను ఎంతో ప్రసిద్ధిగాంచింది. రామ‌ప్పకు వ‌చ్చిన ప‌ర్యాట‌కులు ఇక్కడ బోటింగ్ చేయ‌కుండా వెళ్లరు. ప్రకృతి సోయాగాల మ‌ధ్య, సుంద‌ర మ‌నోహ‌రంగా ఉండే ఈ చెరువు ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను ఎంతోగానో ఆక‌ట్టుకుంటుంది. రామ‌ప్ప ఆల‌యానికి యూనెస్కో గుర్తింపు ద‌క్కడంతో ఈ చెరువుకు ప‌ర్యాట‌క ప్రాంతంగా మ‌రింత ప్రాధాన్యం పెరిగింద‌నే చెప్పాలి. ఈ చెరువును బేస్ చేసుకుని టూరిజం శాఖ అనేక భ‌విష్యత్ ప్రణాళిక‌ల‌ను ర‌చిస్తోంది.

Ramappa cheruvu

అస‌లేం ఏం జ‌రుగుతోంది..

కొద్ది సంవ‌త్సరాలుగా రామ‌ప్ప చెరువు నీటి నిల్వ సామ‌ర్థ్యం కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. పై ప్రాంతాల‌ నుంచి వ‌స్తున్న వ‌ర‌దనీటి మ‌త్తడి ద్వారా కింది ప్రాంతానికి వెళ్తోంది. అయితే, మ‌త్తడిని వెడ‌ల్పు చేసి శాశ్వత నిర్మాణ ప‌నులు చేప‌ట్టడంపై ఇరిగేష‌న్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని పాలంపేట గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. భారీ వ‌ర్షం కురిసినప్పుడు పెద్ద ఎత్తున వ‌ర‌దనీరు చెరువుకు పోటెత్తుతోంద‌ని, మ‌త్తడి చిన్నగా ఉండ‌టంతో అదే స్థాయిలో దిగువ‌కు నీరు వెళ్లలేక ప్రమాద‌క‌ర ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ‌ర‌దనీరు ప్రమాద‌క‌ర స్థాయికి చేరుకుంటున్న స‌మ‌యంలో మ‌త్తడి చుట్టుప‌క్కల వెడ‌ల్పు ప‌నుల‌ను చేప‌డుతున్నారు. ఇప్పటి వ‌ర‌కు మ‌త్తడికి రెండు వైపులా ఐదుమీటర్ల చొప్పున రెండున్నర మీట‌ర్ల లోతుతో ప‌నులు చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇది అత్యంత ప్రమాద‌క‌రమ‌ని ఆ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. వ‌ర‌దనీరు మ‌రింత‌గా పోటెత్తితే గండి ఏర్పడే ప్రమాద‌ం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువు విష‌యంలో ఇరిగేష‌న్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed