ఇలాంటివి ఇంకెన్నో?

by Shyam |
ఇలాంటివి ఇంకెన్నో?
X

దిశ, రంగారెడ్డి: వృద్ధులను, వికలాంగులకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా పింఛన్ అందజేస్తోన్నది. కొన్ని సందర్భాల్లో అవి పక్కదారి పడుతున్నాయి. అర్హత లేని వారికి సైతం పింఛన్ అందుతోందని, మరణించిన వారి పేరుపైనా పింఛన్ కొనసాగిస్తూ ఆ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని సెర్ఫ్ (సోషియో ఎకనామిక్ రీసెర్చ్ ఆన్ ఫ్యూషన్) సర్వేలో వెల్లడైంది. ఇలా పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లో ఆసరా లబ్ధిదారులపై సెర్ఫ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ లో 3457 మంది ఆసరా లబ్ధిదారులను అబ్దుల్లాపూర్ మెట్టు, అమన్ గల్లు, షాబాద్, శంకర్‌పల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎంపిక చేసుకున్నారు. ఇందులో 92 మంది మరణించినట్టు గుర్తించారు. వీరిలో 33 మంది మరణించినప్పటికీ వారి పేరుపై ఆసరా పింఛన్ మంజూరు అవుతోందని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే 2019 డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 వరకు నిర్వహించినట్టు సెర్ఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఆసరా లబ్ధిదారులు 2019 జూన్ నెలలో వివిధ తేదీల్లో మరణించారు. వారి వివరాలను జులై నుంచి లబ్దిదారుల జాబితాలోంచి తొలగించాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మరణించిన వారిపై 6 నెలలుగా గ్రామ కార్యదర్శులు తమ వేలి ముద్రలు వినియోగించి పింఛన్ తీసుకున్నారు. 4 మండలాల్లోని 18 మంది కార్యదర్శులు రూ.6,43,000 డ్రా చేసుకున్నారు. ఈ మొత్తం రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను సెర్ఫ్ అధికారులు కోరారు.

అసలు విషయం బయటపడింది
వృద్ధులు, వికలాంగులు, చేనేత, గీత తదితర పింఛన్లు కలిపి జిల్లాలో 1,75,650 మంది లబ్ధిదారులకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. ఇందులో 3457 మంది లబ్ధిదారులతో సర్వే చేస్తే చనిపోయిన 33 మంది చనిపోయిన వారి పేరు పైన పింఛన్ డబ్బులు తీసుకున్నారు. అదే జిల్లా మొత్తం సర్వే చేస్తే ఇలాంటివి ఇంకెన్ని బయటపడతాయోనని సెర్ఫ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

కలెక్టర్ ఆదేశాలు
మరణించిన లబ్ధిదారుల పేర్లపై తీసుకున్న నగదును రికవరీ చేయాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ జిల్లా పంచాయతీ అధికారి పద్మజ‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శుల వేతనం నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. లేదంటే ఆయా కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed