మియాందాద్‌కు పఠాన్ ఫాదర్ వార్నింగ్ !

by Shyam |
మియాందాద్‌కు పఠాన్ ఫాదర్ వార్నింగ్ !
X

క్రీడలేవైనా.. ఇరుజట్ల క్రీడాకారులు ఆవేశంతో ఘర్షణ పడటం సహజం. ఇక క్రికెట్‌లో అయితే స్లెడ్జింగ్ అనేది సాధారణ విషయమే. అందునా ఆస్ట్రేలియన్లు స్లెడ్జింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాటలతోనే ప్రత్యర్థి జట్టు ఆటగాన్ని రెచ్చగొట్టి ఔట్ చేసినంత పని చేస్తారు. కానీ, జట్టు కోచ్‌లు హుందాగానే వ్యవహరిస్తారు. అయితే.. ఆటగాడిగా ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్.. పాకిస్తాన్ కోచ్‌గా పనిచేసిన సమయంలోనూ మాటలతో ఎదుటి జట్టును కించపరిచేవాడు. అలా మియాందాద్ మాటలకు బాగా నొచ్చుకున్న వారిలో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఒకరు.

2003-04లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నాడు. ఆ సిరీస్‌లో ఇర్ఫాన్ బాగానే రాణించాడు. అయితే ఆ సమయంలో ఇర్ఫాన్‌ను ఉద్దేశించి జావేద్ మియాందాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇర్ఫాన్ లాంటి బౌలర్ పాకిస్తాన్‌లో గల్లీకి ఒకరు ఉంటారని’ వ్యాఖ్యానించాడు. ఆ మాటలు మీడియాలో ప్రసారం కావడంతో ఇర్ఫాన్ కంటే అతని తండ్రి బాగా నొచ్చుకున్నాడు. వెంటనే పాకిస్తాన్ బయలుదేరి వెళ్లాడు. ‘మ్యాచ్ జరుగుతుండగా ఇండియా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లి ఇర్ఫాన్‌ను పిలిచి, వెంటనే మియాందాద్ దగ్గరకు వెళ్లాలని.. అసలు ఈ రోజు తాడోపేడో తేల్చుకుందామని’ పట్టుబట్టాడట. ఈ సమయంలో మియాందాద్ కనుక కనిపిస్తే తన తండ్రి కొట్టినా కొడతాడేమో అని భయపడి.. తీసుకెళ్లడానికి పఠాన్ సంకోచించాడట. అయినా సరే పట్టుబట్టి మియాందాద్ దగ్గరకు వెళ్లాడట ఇర్ఫాన్ తండ్రి. తన కొడుకును ఎందుకు అంత మాటన్నావని నిలదీయగా.. ‘తాను అలాంటి కామెంట్ ఏమీ చేయలేదని, మీ అబ్బాయిని ఒక్క మాట కూడా అనలేదని’ మియాందాద్ చెప్పడంతో ఇర్ఫాన్ తండ్రి చల్లబడ్డాడట.

ఆ తర్వాత ‘నేను మీతో ఏమీ చెప్పడానికి ఇక్కడకు రాలేదు.. మిమ్మల్ని కలిసి అతనో మంచి ప్లేయర్ అని చెప్పడానికి మాత్రమే వచ్చానని’ అక్కడ నుంచి ఇర్ఫాన్ తండ్రి వెళ్లిపోయాడంట. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయాలన్నీ అభిమానులతో పంచుకున్నాడు. ఆ రోజుల్లో నన్ను ఎవరైనా ఒక్క మాటన్నా..మా నాన్న కోపంతో రగిలిపోయేవాడని గుర్తు చేసుకున్నాడు.

Tags : Irfan Pathan, Javed Miandad, Pakistan tour, Sledging

Advertisement

Next Story

Most Viewed