IPL 2023: తొలి మ్యాచ్లోనే దుమ్మురేపిన ఆటగాళ్లెవరో తెలుసా?

by Javid Pasha |
IPL 2023: తొలి మ్యాచ్లోనే దుమ్మురేపిన ఆటగాళ్లెవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ లో ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. ఐపీఎల్ లో బాగా ఆడి.. సెలక్టర్లు దృష్టిలో పడి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని ప్రతి దేశవాలీ క్రికెటర్ కలలు కంటుంటాడు. ఇక ఐపీఎల్ లో ఆడేందుకు చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో మొదటిసారి ఆడుతున్నారు. అలా ఈ సీజన్ లో అరంగేట్రం చేసి ఇప్పటి వరకు శభాష్ అనిపించుకున్న ఆటగాళ్లు వీళ్లే.


1.కైల్ మేయర్స్

వెస్ట్ ఇండీస్ కు చెందిన కైల్ మేయర్స్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఈ సీజన్ లో అరంగేట్రం చేశాడు. క్వింటన్ డి కాక్ గైర్హాజరీతో మేయర్స్ కో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. ఇక మేయర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి. మేయర్స్ అద్భుత పెర్ఫామెన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ 50 రన్స్ తేడాతో గెలిచింది.


2.రాజవర్ధన్ హంగర్గేకర్

రాజవర్ధన్ హంగర్గేకర్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే తరఫున ఈ సీజన్ లో అరంగేట్రం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజవర్ధన్ హంగర్గేకర్ మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన రాజవర్ధన్ హంగర్గేకర్.. 36 రన్స్ ఇచ్చి వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్ వికెట్లు పడగొట్టి ఐపీఎల్ కెరీర్ లో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కాగా గతేడాది వరల్డ్ కప్ గెలిచిన అండర్ 19 జట్టులో రాజవర్ధన్ సభ్యుడు.


3.రీస్ టోప్లీ

ఇంగ్లాండ్ కు చెందిన రీస్ టోప్లీ ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కెమెరాన్ గ్రీన్ వికెట్ పడగొట్టి ఆ జట్టును చావు దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్ లో టోప్లీ 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే ఫీల్డింగ్ చేస్తుండగా భుజానికి గాయం కావడంతో పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ, డుప్లెసిస్ సూపర్ బ్యాటింగ్ తో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ముంబై జట్టును చిత్తు చేసింది.


4.నేహాల్ వధేరా

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 48/4స్కోర్ తో ముంబై ఇండియన్స్ ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాక్ ఆడాడు. తిలక్ వర్మతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 13 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్ కర్ణ్ శర్మ వేసిన ఒకే ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ లు బాదాడు. ఇక వధేరా కొట్టిన రెండో సిక్స్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో లాంగెస్ట్ సిక్సర్ (101 మీటర్లు). సిక్స్ కొట్టి క్రమంలో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వధేరా అవుటయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed